డిసెంబర్ 24న నింగిలోకి బ్లూబర్డ్–2 ..ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్ ప్రయోగం..!

డిసెంబర్ 24న  నింగిలోకి బ్లూబర్డ్–2 ..ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్ ప్రయోగం..!
  • హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్ బాండ్  కోసం అమెరికా లేటెస్ట్ శాటిలైట్
  • స్పేస్​లోకి మోసుకెళ్లనున్న  ఇస్రో ఎల్వీఎం3 ఎం6 రాకెట్
  • ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ లో  కీలక మైలురాయి
  • తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా అత్యాధునిక శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 ను అంతరిక్షంలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 8:54 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్ ఎల్వీఎం3–ఎం6 ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలో ఎర్త్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహాన్ని చేర్చనుంది. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ లోనే కీలక మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ పేర్కొన్నారు. రాకెట్ ప్రయోగం నేపథ్యంలో సోమవారం ఆయన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఏంటీ బ్లూబర్డ్ బ్లాక్ 2

సెల్యులర్ బ్రాడ్ బాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ నెక్స్ట్ జెనరేషన్ శాటిలైట్​ను అమెరికాకు చెందిన ఏఎస్ టీ స్పేస్ మొబైల్ కంపెనీ అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్లలో ఎలాంటి స్పెషల్ సాఫ్ట్ వేర్ అవసరంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్  కావడం ద్వారా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్ బాండ్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 సెల్ కంపెనీలతో ఏఎస్ టీ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా, ఈ మిషన్​లో భాగంగా 2024 సెప్టెంబర్​లో బ్లూబర్డ్ (1 నుంచి 5)  శాటిలైట్లను ఏఎస్ టీ కంపెనీ నింగిలోకి పంపించింది.