న్యూ ఇయర్ రోజు జైలుపాలవ్వొద్దు.. తెల్లావారి 3 వరకూ ఆర్టీసీ బస్సులు

న్యూ ఇయర్ రోజు జైలుపాలవ్వొద్దు.. తెల్లావారి 3 వరకూ ఆర్టీసీ బస్సులు

కొత్త సంవత్సరం రోజు పిల్లల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 2022 జనవరి 1న 12 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ  ఎండీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు.  న్యూ ఇయర్ రోజు పేరెంట్స్ తో కలిసి ట్రావెల్ చేసే పిల్లలకు ఫ్రీ ప్రయాణాన్ని కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు.

న్యూ ఇయర్ రోజు జైలుపాలవ్వొద్దు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులు, బార్లకు అర్ధరాత్రి దాటే వరకూ అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే డిసెంబర్ 31న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత తాగి బండి నడుపుతూ దొరికితే రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ రోజు జైలుపాలు కావొద్దంటూ ఆర్టీసీ ఓ వినూత్న నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణించే బదులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చంటూ ఓ ప్రకటన చేసింది. సిటీలో పలు రూట్లలో న్యూ ఇయర్ రోజున ప్రజల కోసం మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆయా రూట్లలో రాత్రి 7.30 నుంచి 9.30 మధ్య వెళ్లడానికి, అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య రిటర్న్ జర్నీకి ఈ బస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే చార్జీని రూ.100గా ఫిక్స్ చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు.