ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానంతో మూడు రోజుల ఉన్నతస్థాయి పర్యటనకు భారత్ కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ కు ఘనస్వాగతం లభించింది. ఇవాళ ముంబై విమానాశ్రయంలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్లు ఆయనకు స్వాగతం పలికారు.
ముంబైలోని లోక్ భవన్లో మధ్యాహ్నం 3.15 గంటలకు మోదీ- మాక్రోస్ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించి, కొత్త రంగాల్లో సహకారాన్ని విస్తరించే మార్గాలపై చర్చించనున్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, సరఫరా గొలుసులపై చర్చలు కేంద్రీకృతమయ్యే అవకాశముంది. చర్చల అనంతరం సుమారు 12 ఒప్పందాలు, అవగాహన పత్రాలకు సంతకాలు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో బెంగళూరులో జరిగే ఆరో వార్షిక భారత్-ఫ్రాన్స్ రక్షణ సంభాషణలో ప్రస్తుత రక్షణ సహకార ఒప్పందాన్ని మరో దశాబ్దానికి పొడిగించే అంశంపై చర్చించనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలకు మరింత బలం చేకూరనుందని దౌత్యవర్గాలు పేర్కొంటున్నాయి.
