1971 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు మిగ్ 21 ఫైటర్ జెట్‎ది కీలక పాత్ర: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

1971 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు మిగ్ 21 ఫైటర్ జెట్‎ది కీలక పాత్ర: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

న్యూఢిల్లీ: 1971 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు భారత రక్షణ దళంలో మిగ్ 21 ఫైటర్ జెట్‎ది కీలక పాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎లో అరవై ఏండ్లకు పైగా కీ రోల్ ప్లే చేసిన మిగ్ 21 ఫైటర్ జెట్స్ ఇక సర్వీస్ నుంచి వైదొలగనున్నాయి. 23 స్క్వాడ్రన్‌‌కు చెందిన చివరి ఆరు మిగ్‌‌21 జెట్‎లను శుక్రవారం (సెప్టెంబర్ 26) పర్మనెంట్‌‌గా సర్వీస్ నుంచి తొలగించారు. చండీగఢ్‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ స్టేషన్‌‌లో వీటికి వీడ్కోలు పరేడ్‌‌ నిర్వహించారు.

ఈ వేడుకకు మంత్రి రాజ్‌‌నాథ్‌‌, సీడీఎస్ జనరల్ అనిల్‌‌ చౌహాన్‌‌, త్రివిధ దళాల అధిపతులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‎నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మిగ్-21 యుద్ధ విమానం అనేక వీరోచిత పోరాటాలకు సాక్ష్యం. దాని సహకారం ఒక సంఘటనకు ఒక యుద్ధానికి పరిమితం కాలేదు. 1971 యుద్ధం, కార్గిల్ వార్, బాలకోట్ వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్‌ వంటి అతి ముఖ్యమైన యుద్ధాలు, ఆపరేషన్‎లలో మిగ్ 21 నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 

మిగ్-21 మన సాయుధ దళాలకు అపారమైన బలాన్ని అందించని క్షణం లేదు’’ అని అన్నారు. మిగ్-21 కేవలం ఒక విమానం మాత్రమే కాదని, ఇండియా, రష్యా మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మిగ్ 21 ఎంతో శక్తివంతమైనదని.. ఇండియాకు రక్షణ కవచంగా నిలిచిందని కొనియాడారు. తరతరాలుగా వైమానిక యోధులకు మిగ్ 21 స్ఫూర్తినిచ్చిందన్నారు. 

శవపేటికగా పేరొందిన  మిగ్ 21 యుద్ధ విమానాన్ని రష్యా తయారు చేసింది. 1962లో మిగ్ 21 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం ఇదే. ఆరు దశాబ్దాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎కు వెన్నుముకలా నిలిచింది ఈ ఫైటర్ జెట్. వేగం, చురుకుదనానికి ప్రసిద్ధి చెందిన మిగ్ 21 ఇండియన్ ఆర్మీ చేపట్టిన యుద్ధాలు, ఎన్నో ఆపరేషన్లలో క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే.. తేజస్ వంటి ఆధునిక స్వదేశీ విమానాలు ఫీల్డ్‎లోకి రావడంతో మిగ్ 21 సేవలకు ముగింపు పలికింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.