
- గ్యారంటీలు, స్కీమ్‌ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో నిర్ణయం
- అర్హులకే పథకాలు అందేలా చర్యలు
- గ్రామస్థాయిలోనే అప్లికేషన్ల వడబోత
- గత ప్రభుత్వ అక్రమాలను
- ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ
- శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్‌కు ఏర్పాట్లు..
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఇతర హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు గ్రామాల్లోనే ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకోనుంది. ఇందుకోసం గ్రామ సభలను నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచే ఈ కార్యక్రమాన్ని షురూ చేయనుంది. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో 3 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి గ్రామసభలు నిర్వహించి, వివిధ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని, అక్కడే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. రూ.500కే సిలిండర్, మహిళలకు రూ.2,500 సాయం, చేయూత స్కీమ్, గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్, రేషన్ కార్డులు, గృహలక్ష్మి తదితర పథకాలపై గ్రామ సభల్లో జనానికి అవగాహన కల్పించి.. దరఖాస్తులను తీసుకోనున్నారు.
ఇట్ల గ్రామస్థాయిలోనే అర్హులను గుర్తించి పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఎవరైనా అనర్హులు అప్లై చేసుకుంటే అక్కడికక్కడే ఆ దరఖాస్తులను తిరస్కరించి.. అర్హులైన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో గ్రామస్థాయిలోనే వడబోతకు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, నేతలు హర్కర వేణుగోపాల్, అంజన్ కుమార్ యాదవ్, కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ అక్రమాలపై శాఖల వారీగా శ్వేతపత్రాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపైనే కాకుండా.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి సహా అన్నిట్లో విచారణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రతీకార చర్యల్లా కాకుండా, ఉన్న వాస్తవాలను వెలికితీసి ప్రజలకు తెలియజెప్పేలా ఈ కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శాఖల వారీగా ఆయా శాఖల మంత్రులు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల పరిస్థితులు, దుస్థితిపై భట్టి విక్రమార్క.. ఇరిగేషన్, సివిల్ సప్లైస్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇట్లా మంత్రులు తమతమ శాఖలకు సంబంధించి వైట్ పేపర్లను అసెంబ్లీలో రిలీజ్ చేసేలా పీఏసీ భేటీలో సూచనలు వచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా జిల్లాలకు మంత్రులను ఇన్చార్జులుగా చేసే వ్యవస్థను తిరిగి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి నాగ్‌పూర్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ సభకు రాష్ట్రం నుంచి 50 వేల మందిని తీసుకెళ్లేలా పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఆ సభ కో ఆర్డినేషన్‌కు రాష్ట్రం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలి: ఠాక్రే
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని పీఏసీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. పార్టీ విధానాలు, హామీలను ప్రజలు నమ్మారని, పార్టీకి మంచి విజయాన్నందించారని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా నేతలకు ఆయన సూచించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడాలన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కనబరిచిన స్ఫూర్తి, పనితనాన్నే లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోవాలని సూచించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సీఎం రేవంత్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులకు పథకాలు అందేలా చూడటంలో పార్టీ నేతలు కూడా కృషి చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కేవలం ఎమ్మెల్యేలే కాకుండా.. పార్టీ నుంచి బీఫాంలు తీసుకున్న అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సక్సెస్ చేయాలని ఆయన చెప్పినట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత జిల్లా ఇన్చార్జ్ మంత్రులదేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. గ్రామసభల్లోనే అర్హుల ఎంపిక జరగాలని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం.
రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ!
పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలను కాంగ్రెస్ నేతలు పాస్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం చేయగా.. ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. అందులో భాగంగా రెండు లేఖలను హైకమాండ్‌కు రాశారు. తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుతూ సోనియా గాంధీకి ఒక లేఖ రాయగా.. రాష్ట్రం నుంచి ఒక స్థానాన్ని సోనియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మరో లేఖ రాశారు. అయితే, ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.