పని మనిషి నుంచి ఎమ్మెల్యేగా.. బెంగాల్ లో కలితా మాఝీ సంచలన విజయం

పని మనిషి నుంచి ఎమ్మెల్యేగా.. బెంగాల్ లో  కలితా మాఝీ సంచలన విజయం
  • 2021లో ఓడిపోయినా.. మళ్లీ అవకాశం ఇచ్చిన బీజేపీ

కోల్‌‌‌‌‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం నమోదైంది. నెలకు కేవలం రూ. 2,500 సంపాదించుకునే ఒక సాధారణ గృహ కార్మికురాలు, నేడు శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. బీజేపీ తరపున ఆస్‌‌‌‌‌‌‌‌గ్రామ్ నుంచి పోటీ చేసిన కలిత, తన ప్రత్యర్థిపై 12,535 ఓట్ల మెజారిటీతో  గెలిచారు. కలితా మాఝీ ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోయారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి పనిమనిషిగా పని చేసేవారు. ఆమె భర్త ప్లంబర్‌‌‌‌‌‌‌‌. పదేండ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కలిత, సాధారణ కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 

2021 ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పార్టీ ఆమెపై నమ్మకంతో 2026లో మళ్లీ అవకాశం ఇచ్చింది. ఈసారి ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టడంతో లక్షకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. కలిత పేరిట ఉన్న బ్యాంక్ డిపాజిట్లు, నగదు, ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ పాలసీలు కలిపి మొత్తం ఆస్తి విలువ రూ. 1,61,216 మాత్రమే. ఆమె భర్తకు  వారసత్వంగా వచ్చిన చిన్న ఇల్లు ఉంది. కలిత తండ్రి దినసరి కూలీగా పనిచేసేవారు. ప్రస్తుతం కలితకు కుమారుడు పార్థ్ 8వ తరగతి చదువుతున్నాడు.