ముంబై: ఈయూ, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రాబోయే ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆర్బీఐ ఫిబ్రవరి బులెటిన్ పేర్కొంది. ఈ ఒప్పందాల ప్రకటన తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు పెరగడంతో పాటు రూపాయి విలువ పుంజుకుందని వెల్లడించింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది.
పారిశ్రామిక కార్యకలాపాలు, సేవా రంగం ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఈసారి బడ్జెట్‌లో మూలధన వ్యయానికి పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలిక వృద్ధికి బాటలు పడ్డాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఎఫ్టీఏల వల్ల ఎగుమతులు పెరగడంతో పాటు ఉపాధి కల్పించే రంగాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల సమీప భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి డోకా లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
