గాలి నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. చైనా స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ

గాలి నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. చైనా స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ

క్రూడ్ ఆయిల్ సంక్షోభం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ.. చైనాకు చెందిన ఒక స్టార్టప్ సంచలన ప్రకటన చేసింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి కృత్రిమ పెట్రోల్‌ను తయారు చేసే సాంకేతికతను తాము కనుగొన్నట్లు షాంఘైకి చెందిన 'కార్బోనాలజీ' అనే సంస్థ వెల్లడించింది. ఈ స్టార్టప్ గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నీటిలోని హైడ్రోజన్‌ను వేరు చేసి, వాటిని సింథటిక్ ఫ్యూయెల్ గా మార్చే ప్రక్రియను తక్కువ ఖర్చుతోనే విజయవంతం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న తరుణంలో..  చైనా ఈ ప్రత్యామ్నాయ ఇంధనంపై భారీ ఆశలు పెట్టుకుంది.

కార్బోనాలజీ సంస్థను 2024లో టెస్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడిగా స్థాపించారు. ఈ స్టార్టప్ కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా డీజిల్, జెట్ ఇంధనం, నాఫ్తా వంటి వాటిని కూడా మార్కెట్ ధరలతో పోటీ పడేలా తక్కువ రేట్లకే ఉత్పత్తి చేయగలమని చెబుతోంది. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను నేరుగా సంగ్రహించే 'డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్' విధానాన్ని వీరు వాడుతున్నారు. సోలార్ అండ్ విండ్ ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఆ తర్వాత ఫిషర్-ట్రోప్ష్ లేదా మెథనాల్ సింథసిస్ వంటి రసాయన ప్రక్రియల ద్వారా గాలిలోని కార్బన్‌తో కలిపి హైడ్రోకార్బన్ ఇంధనాలను తయారు చేస్తారు. ఇవి ప్రస్తుతం మనం వాడుతున్న వాహనాల ఇంజన్లకు సరిగ్గా సరిపోతాయి.

ALSO READ : అమెరికాకు కోలుకోలేని దెబ్బ: రాడార్‌కు దొరకని ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానంపై ఇరాన్ దాడి

ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి. తన అవసరాలకు అవసరమైన క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ వాటాను చైనా ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచే పొందుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, షిప్పింగ్ రూట్లలో అంతరాయాల వల్ల చైనా ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో గాలి, నీటి నుంచి ఇంధనాన్ని తయారు చేసే 'ఇ-ఫ్యూయల్' సాంకేతికత చైనాకు ఒక వరంలా మారనుంది. ఇది కేవలం ఇంధన కొరతను తీర్చడమే కాకుండా, పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం వల్ల దీని వాణిజ్య విస్తరణపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు.

సాంకేతికపరంగా ఇది గొప్ప విజయమే అయినప్పటికీ.. దీని తయారీ ఖర్చుతో పాటు నిర్వహణ సామర్థ్యంపై నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి కృత్రిమ ఇంధనాల తయారీకి సాధారణ పెట్రోల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు గాలి నుంచి సేకరించిన కార్బన్‌ను భూగర్భంలో నిల్వ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాయి కానీ, దానిని ఇంధనంగా మార్చడంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ కార్బోనాలజీ సంస్థ షాంఘైలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే, చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చైనా ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలదు.