పంట పండుద్ది.. ఈ సారి వానలే వానలు

పంట పండుద్ది.. ఈ సారి వానలే వానలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రంలో ఫుల్లు వర్షాలు కురుస్తాయని, పంటలు కూడా మంచిగ పండుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో సాగుకు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని, పంటల దిగుబడి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్​ దీవులను తాకాయి. ఇవి ఇంకా బలపడి జూన్​ 6కి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్‌‌ 5న రుతుపవనాలు తెలంగాణను తాకాల్సి ఉండగా, ఆరు రోజులు ఆలస్యంగా 10, 11 తేదీల్లో రాష్ట్రానికి చేరనున్నాయి. జూన్​ 6 వరకు ఎండల ప్రతాపం కొనసాగుతుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటొచ్చని, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.

ఈసారి వానలే వానలు

రాష్ట్రంలో జూన్​లో వాతావరణం చల్లగా ఉంటుందని, జులై, ఆగస్టుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 720 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 750 మీల్లీమీటర్లను సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. సాధారణంతో పోల్చితే ఈసారి 96 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రైతులకు పరిస్థితులు అనుకూలంగా ఉండనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. గత 30 ఏళ్ల వర్షపాతం వివరాలను గమనిస్తే సగటున జూన్‌‌లో 135.6

మిల్లీమీటర్లు, జులైలో 231.1, ఆగస్టులో 217.1, సెప్టెంబర్​లో 160 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 749.4 సగటు వర్షపాతం రికార్డయింది. జిల్లాలవారీగా సీజనల్‌‌ వర్షపాతం సగటును పరిశీలిస్తే ఆదిలాబాద్‌‌లో అత్యధికంగా 998.8 మిల్లీమీటర్లు.. జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యల్పంగా 490.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.