
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి జరిగే పీవీఎల్ పోస్టర్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి గురువారం సీఎం ఆవిష్కరించారు. క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
‘ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల హైదరాబాద్ క్రీడా రంగంలో ఒక ముఖ్యమైన నగరంగా గుర్తింపు పొందుతుంది. ఈ సీజన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. పీవీఎల్ నిర్వాహకులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, ఈ లీగ్‌ను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పీవీఎల్ నాలుగో సీజన్‌లోని మొత్తం 38 మ్యాచ్‌లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, శాట్జ్ వీసీ, -ఎండీ సోని బాలదేవి కూడా పాల్గొన్నారు.