కృష్ణమ్మ బిరబిర.. గోదావరి వెలవెల..నిండుకుండల్లా శ్రీశైలం, నాగార్జున సాగర్

కృష్ణమ్మ బిరబిర..  గోదావరి వెలవెల..నిండుకుండల్లా శ్రీశైలం, నాగార్జున సాగర్
  •  శ్రీశైలంలో ఆరు గేట్లు ఓపెన్
  • 26 గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల
  • శ్రీరాంసాగర్ కు స్వల్పంగా వరద
  • ఎగువ నుంచి  12,769 క్యూసెక్కులు
  •  ఎల్లంపల్లిలోనూ అదే పరిస్థితి

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీ గా వరద వస్తుండటంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలుతున్నారు. గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వస్తోంది.   కడెం, స్వర్ణ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 1,66,957 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా  ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పవర్ జనరేషన్ నడుస్తోంది. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం వద్ద ఇన్‌ఫ్లో 2,28,601 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. కాగా ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం 309.65 టీఎంసీలకు చేరింది.  గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి 12,769 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1080 అడుగుల నీరుంది. కాకతీయ, సరస్వతి కాలువలతో  పాటు మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి మట్టం 1183 అడుగులు కాగా..1182.9 ఫీట్ల నీరుంది. ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే జిల్లాలోన కడెం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. పూర్తి స్థాయి మట్టం 700 అడుగులు కాగా.. 695 ఫీట్లకు నీరు చేరింది. రెండు వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టులోకి 16,027 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా..ప్రస్తుతం13.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూసీ నదికి వరద పోటెత్తింది. వలిగొండ మండలం సంగెం పరిధిలోని భీమలింగం వద్ద మూసీ ఉధృతంగా  ప్రవహిస్తోంది. లో లెవల్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తింది. దీంతో సంగెం పరిసర ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు ప్రమాదాలు జరకుండా నియంత్రిస్తున్నారు.