కుండపోత వాన..నిండిన చెరువులు, కుంటలు

కుండపోత వాన..నిండిన చెరువులు, కుంటలు

ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా కురిసిన జోరు వర్షంతో రైతులు సంబురపడుతున్నారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. నల్లగొండలో సాయంత్రం నాలుగింటికి మొదలైన వాన రాత్రి పదింటి దాకా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీధుల్లో వరద పోటెత్తగా, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షంతో చాలా ప్రాంతాల్లో విద్యార్థులు అర్ధరాత్రి వరకు స్కూళ్లలోనే ఉండిపోయారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

యాదాద్రి జిల్లాలో రాత్రి కుండపోత వాన పడింది. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్, రాజాపేట మండలాల్లో రాత్రి వాన దంచికొట్టింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఊర్లలోని చెరువులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుర్కపల్లిలోని బూరుకుంట చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చింది.

రాత్రి కురిసిన కుండపోత వర్షానికి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాఠశాల తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షంతో తరగతి గది గోడకూలింది. యాదగిరిపల్లిలోని మరో ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదుల్లోకి వరదనీరు చేరడంతో..బురదమయంగా మారాయి. వరదతో స్కూల్ అంగన్ వాడీ కేంద్రంలోని సరుకులు మొత్తం నీటమునిగాయి. బియ్యం, పాలు, గ్యాస్ స్టౌ, వంటసామాగ్రి నీటమునగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షపు నీరు స్కూల్ ఆవరణ నుంచి బయటకు వెళ్లే దారి లేకపోవడంతో నీళ్లు మొత్తం స్కూల్ గదుల్లోనే నిలిచిపోయాయి.

భువనగిరి మండలంలోని వీరవెల్లి, చందుపట్ల, బండసోమారం పలు గ్రామాల్లో కురిసిన జోరు వానకు ఎన్నడూలేని విధంగా చెరువులు, కుంటలు నిండాయి.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అర్ధరాత్రి వరకు కురిసిన వర్షంతో చాలా గ్రామాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా గ్రామాల్లో పంటపొలాల్లోకి నీరు చేరింది. రోడ్లపై వరద పారుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలియా మున్సిపాలిటీ పరిధిలో వర్షంతో రోడ్లన్నీ బురద మయం అయ్యాయి. దీనికి తోడు పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అటు ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.