
తిరువనంతపురం: విఝింజమ్ ఇంటర్నేషనల్ సీపోర్టుతో కేరళ ఎకానమీకి మరింత బూస్ట్ చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఓడరేవుతో రాష్ట్ర ప్రజలకు కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. రూ.8,686 కోట్ల వ్యయంతో తిరువనంతపురం సమీపంలో చేపట్టిన విఝింజమ్ అంతర్జాతీయ సీపోర్టును మోదీ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.
వచ్చే కొన్నేండ్లలో దేశ ట్రాన్స్ షిప్ మెంట్ మూడురెట్లు పెరుగుతుందన్నారు. ఇప్పటివరకూ దేశ ట్రాన్స్ షిప్ మెంట్ ఆపరేషన్లలో 75 శాతం కార్యకలాపాలు విదేశీ పోర్టుల్లోనే జరిగాయని, దీంతో రూ.కోట్ల రెవెన్యూని మనం కోల్పోయామని చెప్పారు. కొత్త సీపోర్టుతో రెవెన్యూ లాస్ ఉండదని, దేశ డబ్బు మన దేశంలోనే ఉంటుందని తెలిపారు. దీంతో కేరళ ప్రజలకు కొతగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
‘‘కేరళ నుంచి విదేశాలకు నౌకల్లో చాలా కాలం పాటు సరుకు రవాణా జరిగింది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి కేరళ కీలక హబ్‌గా ఎదిగింది. కొత్త సీపోర్టును బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశాభివృద్ధిలో తీరప్రాంత రాష్ట్రాలు, పోర్ట్ సిటీలు ప్రధాన కేంద్రాలు కానున్నాయి” అని మోదీ వ్యాఖ్యానించారు. అదానీ పోర్ట్స్ అభివృద్ధి చేసిన ఈ నౌకాశ్రయంపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు
కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఎంపీ శశిథరూర్ తో కలిసి ఒకే వేదికపై నుంచి నరేంద్ర మోదీ కొత్త సీపోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన సెటైర్లు వేశారు. తన పక్కన ఉన్న సీఎం విజయన్, శశిథరూర్ ను చూసి చాలా మందికి నిద్రపట్టదని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.