- ఈ ప్రాజెక్ట్ ఆపాలని సోనియా, రాహుల్ యత్నించారు
- దీనికి ఎన్‌జీటీ క్లియరెన్స్ సంతోషదాయకం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: అంతర్జాతీయ వాణిజ్య, వ్యూహాత్మక రంగాల్లో దేశ ప్రతిష్ఠను పెంచే ‘గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు’కు సంబంధించి అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని బుధవారం ఒక ప్రకనటలో ఆయన విమర్శించారు.
దాదాపు రూ. 80 వేల కోట్ల గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ముందుకు వెళ్ళకుండా అడ్డుకోవడానికి.. సోనియా, రాహుల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా సోనియా అంతర్జాతీయ కుట్రదారులతో చేతులు కలిపి సెప్టెంబర్ 5న ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో తప్పుడు కథనాలు రాశారని విమర్శించారు. పర్యావరణ అనుమతులపై ఆమె చేసిన ఆరోపణలను ఎన్‌జీటీ కొట్టివేసిందని, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలిపారు.
దేశానికి ఎంతో ఉపయోగకరం..
హిందూ మహాసముద్రం – పసిఫిక్ సముద్రాలను కలి పే మలక్కా జలసంధి సమీపంలోఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య హబ్‌ను నిర్మించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, విమానాశ్రయం, విద్యుత్ ప్లాంట్, ఆధునిక టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఓడరేవులపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్ ను గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో కీలక భాగస్వామిగా మార్చడం వంటి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
