
ఈ వారాంతంలో జరిగే G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన నాయకులు కొందరు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, యూకె ప్రధాన మంత్రి రిషి సునక్, ఇతర దేశాధినేతలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనాలు, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలపై ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు.
ALSO READ : కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక
జో బిడెన్ ఈరోజు తాను న్యూఢిల్లీకి వెళ్తున్నానని, G20 సమ్మిట్‌కు హాజరవుతానని ధృవీకరించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సామాజిక ప్రభావం, స్వచ్ఛమైన శక్తి పరివర్తన, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం, పేదరికంతో పోరాడటానికి బహుపాక్షిక బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం గురించి బిడెన్ చర్చించాలనుకుంటున్నారు. ఇక బ్రిటన్ ప్రధానిగా భారతదేశానికి తన మొదటి అధికారిక పర్యటన సందర్భంగా రిషి సునక్ న్యూఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద సైతం తన హాజరును ధృవీకరించారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నారు. అయితే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 9, 10 తేదీలలో భారతదేశంలో ఉంటారని ఆయన కార్యాలయం ధృవీకరించింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లతో కూడిన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ సమ్మిట్‌కు హాజరవనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ కూడా త్వరలోనే న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక ఉత్తర కొరియా అణు బెదిరింపులు, క్షిపణి రెచ్చగొట్టే చర్యలపై స్పందించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సమ్మిట్‌లోని నాయకులను కోరే అవకాశం ఉంది.
ఎవరు గైర్హాజరు కానున్నారంటే,,
సమ్మిట్‌కు గైర్హాజరవుతున్న వారిలో జి జిన్‌పింగ్ ప్రముఖంగా ఉంటారు. ఆయన గైర్హాజరీలో, ది స్టేట్ కౌన్సిల్‌కు చెందిన చైనీస్ ప్రీమియర్ లి కియాంగ్ ఆ దేశ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. 2008లో మొదటి ఎడిషన్ జరిగిన తర్వాత చైనా అధ్యక్షుడు జి20 నేతల సదస్సుకు దూరమవడం ఇదే తొలిసారి. వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సంవత్సరం G20 సమ్మిట్‌కు మిస్ కానున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రష్యా అధ్యక్షుడికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీన్ని క్రెమ్లిన్ తీవ్రంగా ఖండించింది. అంటే విదేశాలకు వెళ్లేటపుడు అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ న్యూఢిల్లీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ కు కరోనా పాజిటివ్ కారణంగా తాను G20 సమ్మిట్‌కు హాజరు కాలేనని ప్రకటించారు. ఇక ఈ మెగా ఈవెంట్‌కు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ హాజరుకావడం లేదు.
హాజరుకానున్న జీ20యేతర సభ్యులు
G20 సభ్యులతో పాటు, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నైజీరియా, ఈజిప్ట్, మారిషస్, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులను సైతం భారతదేశం ఆహ్వానించింది. ఈ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అగ్ర నిర్వాహకులు కూడా పాల్గొంటారు.