బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపి..ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం

బెట్టింగ్  వద్దన్నందుకు తండ్రిని చంపి..ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం
  • జూదంలో రూ.6 లక్షలు లాస్​.. తండ్రి మందలించడంతో కక్ష
  • బయటికి తీసుకెళ్లి గొంతు కోసి దారుణ హత్య
  • సూసైడ్ చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం
  • పోలీసుల విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్న కొడుకు
  • హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు:  హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. బెట్టింగ్ వద్దని మందలించిన తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరినీ నమ్మించాడు. డెడ్​బాడీని సొంతూరికి తీసుకెళ్లి దహన సంస్కారాలకూ ఏర్పాట్లు చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొడుకును అదుపులోకి తీసుకుని  విచారించారు. చివరికి  తండ్రిని  తానే  చంపినట్లు  ఒప్పుకున్నాడు.  వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతుల గుట్ట గ్రామానికి చెందిన కేతావత్ హనుమంతు.. బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వలస వచ్చాడు.  భార్య జములమ్మ, ఇద్దరు కొడుకులు కేతావత్ రవీందర్, సంతోష్ తో కలిసి గోపనపల్లి పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

 మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అవసరాల కోసం హనుమంతు తన ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి రూ.6 లక్షలు లోన్ తెచ్చాడు. ఇంటర్ చదివి ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటుపడిన 19 ఏండ్ల పెద్ద కొడుకు రవీందర్.. ఇంట్లో ఉన్న రూ.6 లక్షలతో బెట్టింగ్ ఆడి పోగొట్టాడు. ఈ విషయమై హనుమంతు, రవీందర్ మధ్య గొడవ జరిగింది. కొడుకును తండ్రి తీవ్రంగా మందలించాడు. బెట్టింగ్ జోలికి పోవద్దని మండిపడ్డాడు. దీంతో తండ్రిపై రవీందర్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తండ్రిని చంపేయాలని ప్లాన్ వేశాడు. మంగళవారం మధ్యాహ్నం తండ్రి హనుమంతును రవీందర్ గోపనపల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. తర్వాత గొంతు కోసి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. 

కోతులగుట్ట నుంచి తిరిగి గచ్చిబౌలికి డెడ్​బాడీ

గోపనపల్లిలోనే ఉంటున్న బాబాయి రమేశ్​కు రవీందర్ ఫోన్ చేసి.. తండ్రి హనుమంతు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. రవీందర్ మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు.. హనుమంతు (37) డెడ్​బాడీని అంత్యక్రియల కోసం సొంతూరైన కోతులగుట్టకు తరలించారు. దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమంతు చనిపోయిన వార్త తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. ఘనపూర్ పోలీస్ స్టేషన్​కు ఫోన్ చేశారు. హనుమంతు ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, వెంటనే దహన సంస్కారాలు ఆపించాలని చెప్పారు. దీంతో కోతులగుట్ట పెద్దలతో ఘనపూర్ పోలీసులు మాట్లాడారు. అంత్యక్రియలు చేస్తే అందరిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చివరికి డెడ్​బాడీని ఘనపూర్ పోలీసులు గచ్చిబౌలికి తిరిగి పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. కొడుకు రవీందర్​ను గచ్చిబౌలి పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రవీందర్​ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.