- దక్షిణాదికి అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లను
- కిషన్ రెడ్డి సమర్థించడం సిగ్గుచేటు
- సింగరేణిలో కొత్త గనుల కోసం చర్యలు
మంచిర్యాల ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరణకోల్ బెల్ట్ /నస్పూర్, వెలుగు: మహిళా రిజర్వేషన్లతో రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధం లేదని, అధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. తెలంగాణతో పాటు దక్షిణాదికి అన్యాయం చేయాలని చూస్తే మరో ఉద్యమాన్ని చూస్తా రని హెచ్చరించారు. మంగళవారం మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రిలో ఎంపీ పర్యటించారు. మంచిర్యాల హైటెక్ సిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో పాల్గొని.. ప్రజల నుంచి వినతు లు తీసుకున్నారు.
అనంతరం మంచిర్యాల రైల్వే స్టేష న్‌లో అమృత్ భారత్ స్కీం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి స్టేడియంలో మార్నింగ్ వాక్ చేసిన ఎంపీ వంశీకృష్ణ.. వాకర్స్, స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపు క్రీడాకారులతో షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో బీజేపీ సర్కార్ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు.
డీలిమిటేషన్ పేరుతో బీజేపీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును ఇండియా,- పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవగాహన లేకుండా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థించడం సిగ్గచేటన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదేండ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే చేసిందని తెలిపారు. రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌పై ఒత్తిడి తెచ్చి మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ స్కీం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌలత్‌లు కల్పిస్తున్నట్టు తెలిపారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో రూ.25 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు.
యువతకు ఉపాధి అవకాశాలు..
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. యువతకు స్కిల్, ఏఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవసరమని, ఏటీసీలో శిక్షణ తీసుకుంటే ఉపాధి లభిస్తుందని చెప్పారు. టామ్ కామ్ సంస్థ ద్వారా 5 నుంచి 10 వేల మందికి విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇందుకు కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవచూపుతున్నారని చెప్పారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు, లాభాల కోసం ఇతర గనులు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు. కొత్త గనులు కేటాయించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపుదల, పెర్క్స్ పై ఐటీ మాఫీ కోసం కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విన్నవిస్తే స్పందించడం లేదని ఆరోపించారు.
మెడికల్‌బోర్డు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి భూపేందర్‌యాదవ్‌ను కలిసి నేషనల్ హైవే 63పై జోడువాగుల వద్ద బ్రిడ్జికి ఫారెస్ట్ క్లియరెన్స్, గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. అంతకుముందు మందమర్రిలో కాంగ్రెస్ లీడర్ ఉపేందర్‌గౌడ్ మేనల్లుడు బండారి రాజేశ్ వడదెబ్బతో మృతిచెందగా ఆయన భౌతికకాయం వద్ద ఎంపీ వంశీకృష్ణ నివాళి అర్పించారు.

