- అంతిమయాత్రలో దారి పొడువునా పాటల ప్రవాహం
- అల్వాల్ మహాబోధి స్కూల్లో అధికార లాంఛనాలతో వీడ్కోలు
- గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేసిన పోలీసులు
భుజం మీద గొంగడి.. చేతిలో ఎర్రెర్రని రుమాలు.. మునివేళ్లపై దరువులేసే కట్టె.. కాళ్లకు ఘల్లు ఘల్లుమని మోగే గజ్జెలు.. గళం నిండా పీడితుల పక్షాన గర్జించే పాటలు..! వెన్నులో తూటాను మోస్తూ, పేదలకు వెన్నెముకగా నిలిచిన ఆ పాటల రూపం.. పుడమితల్లి పొత్తిళ్లలో శాశ్వతంగా నిద్రపోయింది!! ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి అశ్రునయనాల నడుమ ముగిశాయి. ఆయనను కడసారి చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. 17 కిలో మీటర్ల పొడవునా.. 8 గంటలకుపైగా సాగిన అంతిమయాత్రలో తొవ్వంతా పాటల ప్రవాహమే... కళాకారుల కన్నీటి గానాలే! పొద్దు పొడిచినన్నాళ్లూ, ప్రశ్నించే గొంతుకలు ఉన్నన్నాళ్లూ గద్దరన్న ఉంటడని, తన పాట ఉంటదని అభిమానులు, ప్రజా సంఘాల నేతలు నినదించారు. ఆ ప్రజాగాయకుడి స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని.. పార్థివదేహానికి తుది వీడ్కోలు పలికారు.
హైదరాబాద్, వెలుగు: గద్దర్ అంతిమ యాత్ర పోలీసుల గౌరవ వందనంతో సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి మొదలైంది. ఎరుపు, నీలి, పచ్చ రంగుల దుస్తులు ధరించిన కళాకారులు రెండు వరుసలుగా ముందుకు సాగుతూ యాత్రను కొనసాగించారు. స్టేడియం నుంచి అంతిమ యాత్ర వాహనాన్ని గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అమరులకు జోహార్ పలికిన తర్వాత బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్, ప్యాట్నీ చౌరస్తాల మీదుగా జేబీఎస్, తిరుమలగిరి, లాల్‌బజార్ గుండా అల్వాల్‌కు చేరుకుంది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు దాదాపు 17 కిలో మీటర్ల మేర 8 గంటల పాటు యాత్ర కొనసాగింది. స్టేడియం నుంచి బయలు దేరిన తర్వాత కూడా వేలాది మంది యాత్రలో చేరుతూ వచ్చారు. వివిధ జిల్లాల నుంచి కవులు, కళాకారులు, మేధావులు భారీ సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని పాటలు పాడుతూ ముందుకు కదిలారు.
భూదేవీ నగర్లో గద్దర్ నివాసం
అల్వాల్‌లోని భూదేవీనగర్‌లో ఉన్న గద్దర్ నివాసానికి మధ్యాహ్నం నుంచి ఆయన బంధువులు, ఆత్మీయులు చేరుకున్నారు. సాయంత్రానికి అక్కడికి భారీగా జనం తరలివచ్చారు. యాత్రతో తరలివచ్చిన వారితోపాటు గద్దర్ స్వగ్రామం తూప్రాన్ నుంచి కూడా వందలాది మంది ఆఖరుచూపు కోసం వచ్చారు. గద్దర్ పార్థివదేహం సాయంత్రం 5.50 గంటలకు ఇంటికి చేరుకుంది. అక్కడ ఒక గంటసేపు ఉంచారు. సీఎం కేసీఆర్ వచ్చి గద్దర్‌కు నివాళులు అర్పించారు. కుబుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మహాబోధి స్కూల్ ఆవరణకు గద్దర్ పార్థివదేహాన్ని తరలించారు.
గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి
రాత్రి ఏడు గంటలకు మహాబోధి స్కూల్ ఆవరణకు గద్దర్ పార్థివదేహం చేరుకుంది. అప్పటికే అక్కడికి వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వాళ్లను అదుపు చేయడం పోలీసులకు ఒక దశలో కష్టంగా మారింది. రాత్రి ఎనిమిది గంటలకు బౌద్ధమత సంప్రదాయం ప్రకారం ఐదు పంచశిలా ప్రవచనాలు చదివి గద్దర్ పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పోలీసులు గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. తర్వాత గద్దర్ కుటుంబ సభ్యులు, ఆప్తులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
బందోబస్తులో 5 వేల మంది పోలీసులు..
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రజా గాయకుడు గద్దర్ అంత్య క్రియలు ముగిశాయి. అంతిమయాత్ర పూర్తయ్యేదాకా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దాదాపు 5 వేల మంది పోలీసులు డ్యూటీ చేశారు. గద్దర్ పార్థివదేహం సందర్శన నేపథ్యంలో బషీర్‌బాగ్ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలకు హై సెక్యూరిటీ కల్పించారు. అంతిమయాత్ర సాగిన ఎల్బీస్టేడియం, గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్ రోడ్స్, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో దారిపొడవునా రెండు వైపుల పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆయా రూట్లలో ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. రద్దీ ప్రాంతాలు కావడంతో కీలక మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. బందోబస్తు ఏర్పాట్లను జాయింట్ సీపీలు, జోన్ డీసీపీలు స్వయంగా పర్యవేక్షించగా..కొద్దిపాటి తోపులాట మినహా అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను పోలీసు సిబ్బంది విజయవంతంగా కంట్రోల్ చేశారు.
ఆట పాటలతో మార్మోగిన ఎల్బీ స్టేడియం
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గద్దర్ ఇక లేరన్న వార్త తెలుసుకొని వందలాది మంది హైదరాబాద్ అమీర్‌పేటలోని హాస్పిటల్‌కి తరలివచ్చారు. దాంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ నుంచి గద్దర్ పార్థివదేహాన్ని సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియానికి తరలించారు. అప్పటి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వందలు, వేలాదిగా అభిమానులు, కళాకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వచ్చి గద్దర్‌కు నివాళులు అర్పించారు. స్టేడియమంతా గద్దర్ జ్ఞాపకాలతో కూడిన పాటలతో మార్మోగింది.
ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ జానపద గొంతుక గద్దర్‌కు కవులు, కళాకారులు, లీడర్లు, అధికారులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. ‘జోహార్ గద్దర్’, ‘గద్దర్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన అంతిమ యాత్ర.. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ వరకు సాగింది. స్కూల్ ఆవరణలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గద్దర్ ఆఖరిచూపు కోసం వేలాది మందిగా తరలివచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అల్వాల్ భూదేవీనగర్లోని గద్దర్ నివాసానికి సీఎం కేసీఆర్ వచ్చి ఆయనకు నివాళులర్పించారు.

