3 లింకులు,29 కేసులు.. క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు

3 లింకులు,29 కేసులు.. క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు

గద్వాల జిల్లాలో కరోనా కలవరం
మర్కజ్ లింకుతో 21 మందికి.. కర్నూలు లింకుతో మరొకరికి పాజిటివ్
టీఆర్ఎస్ నేత అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మూడు లింకులతో 29 మందికి కరోనా అంటుకుంది. ఇందులో ఒక్క మర్కజ్ లింక్ కేసులే 21 ఉన్నాయి. మరో ఏడు కేసులు.. టీఆర్ఎస్ నేత అంత్యక్రియల్లో పాల్గొన్న వారివి. ఈ ఏడుగురిలో ఆరుగురు ఆ లీడర్ ఫ్యామిలీ మెంబర్సే. ఇంకో కేసు ఇటీవల కర్నూలులో కరోనాతో మృతి చెందిన ఓ డాకర్ వద్ద కొన్నిరోజుల క్రితం ట్రీట్‌‌మెంట్ తీసుకున్న వ్యక్తికి సంబంధించింది. ఇప్పటికే జిల్లాలో చాలా మందిని అధికారులు క్వారంటైన్ చేశారు. ఇందులో స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

మర్కజ్ లింక్..
గద్వాల జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు 52 మంది వెళ్లివచ్చినట్లు గుర్తించారు. వారందరినీ క్వారెంటైన్ కు తరలించి టెస్టులు చేశారు. అందులో 15 మందికి పాజిటివ్ వచ్చింది. వారి నుంచి కుటుంబసభ్యులకు ఆరుగురికి కరోనా అంటుకుంది.

కర్నూలు లింక్..
ఇటీవల ఏపీలోని కర్నూలులో ఓ డాక్టర్ కరోనాతో మృతి చెందారు. గద్వాల జిల్లాకు కర్నూలు సమీపంలో ఉండటంతో ఇక్కడి వారు అక్కడికి వెళ్లి ఆ డాక్టర్ దగ్గర కొన్నిరోజుల క్రితం ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారు. వారిలో రెండు రోజుల క్రితం ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్నూలు డాక్టర్ దగ్గర ట్రీట్‌‌మెంట్ తీసుకున్న మరో ఎనిమిది మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. వారి శాంపిల్స్ అధికారులు టెస్టులకు పంపించారు.

మాజీ కార్పొరేటర్ అంత్యక్రియల్లో రూల్స్ బ్రేక్
గద్వాలకి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ ఈ నెల 9న గాంధీ హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలను మరుసటి రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. లాక్డౌన్ రూల్స్ ప్రకారం అంత్యక్రియల్లో చాలా తక్కువ మంది పాల్గొనాల్సి ఉండగా.. వంద మందికిపైగా పాల్గొన్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ కౌన్సిలర్ కుమారుడికి టెస్టులు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు ఆ కుటుంబంలోని అందరినీ క్వారంటైన్ చేశారు. వారితోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్న మరికొందరికి టెస్టులు చేయగా.. శనివారం ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఐదుగురు మాజీ కౌన్సిలర్ ఫ్యామిలీ మెంబర్సే. కరోనా పాజిటివ్ వచ్చిన ఈ మొత్తం ఏడుగురిలో ఎవరికీ కూడా ఫారిన్ ట్రావెల్ హిస్టరీ కానీ, ఢిల్లీ మర్కజ్ వెళ్లిన హిస్టరీ కానీ లేదని అధికారులు అంటున్నారు. మాజీ కౌన్సిలర్ న్యుమోనియాతో చనిపోయినట్లు వారు చెప్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా సోకడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు
మాజీ కౌన్సిలర్ అంత్యక్రియల్లో టీఆర్ఎస్ కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కూడా పాల్గొన్నా రు. వారిలో ఇప్పుడు
కొందరు హోంక్వారంటైన్ లో ఉన్నారు. మరికొందరిని క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. జిల్లా కేంద్రంలోని కంటెయిన్మెంట్ ప్రాంతాలు మోహిన్ మల్ల, గంజి పేట, వేద నగర్ లో కలెక్టర్ శృతి ఓజా, ఇన్ ఛార్జ్ ఎస్పీ అపూర్వ రావు పర్యటించారు.