- 45 టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
- మైనర్ ఇరిగేషన్ కింద తొలుత
- 45 టీఎంసీలకు క్లియరెన్స్ అడిగినం
- హరీశ్వి పచ్చి అబద్ధాలు..
- గోబెల్స్‌ను మించిపోయారు
- ఎంత ఖర్చయినా సరే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి
- 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం
- స్పీకర్ అనుమతి ఇస్తే అసెంబ్లీలో
- కృష్ణా బేసిన్‌పై పీపీటీకి రెడీ
- అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు నీటి కేటాయింపులను 45 టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన తెలిపారు.
ఏపీ మళ్లించే గోదావరి నీటికి బదులు కృష్ణాలో రావాల్సిన 45 టీఎంసీల అంశం ట్రిబ్యునల్‌లో పెండింగ్ ఉన్నందున, మైనర్ ఇరిగేషన్ కింద ఆదా అయ్యే 45 టీఎంసీలను తొలుత క్లియర్ చేయాలని మాత్రమే కేంద్ర జల సంఘాన్ని కోరామని చెప్పారు. అంతమాత్రాన ఆ 45 టీఎంసీలను వదులుకున్నట్లు కాదని, ఈ విషయం తెలిసినా కావాలనే బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘వాళ్లు కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ, ఖర్చు చేసిన లక్ష కోట్లలో.. కనీసం సగమైనా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు చూపించలేదు?” అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై మాట్లాడారు. కాళేశ్వరంలో వాటర్ సోర్సును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లే, పాలమూరు ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మాజీ మంత్రి హరీశ్ రావు ఇరిగేషన్లో తానే మాస్టర్ అన్నట్లు పోజులు కొడుతున్నారు. కానీ వారి హయాంలో చేసిన ఇలాంటి తప్పులే తెలంగాణకు శాపంగా పరిణమించాయి. హరీశ్ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్ ను మించారు. ఆయన్ను చూసి గోబెల్స్ కూడా ఏడుస్తుంటాడు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా నేను ఎందుకు లేఖ రాస్తా? స్పీకర్ అనుమతి ఇస్తే అసెంబ్లీలో కృష్ణా బేసిన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ అతి తెలివిని అబద్ధాలను బట్టబయలు చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్
‘‘కృష్ణా నది జలాలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పు డు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందా? పాలమూరు ఎత్తిపోతలకు కేటాయించిన 90 టీఎంసీలు బరాబర్ వాడుకుంటాం. ఈ టర్మ్ లోనే ప్రాజెక్టు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. కృష్ణా బేసిన్‌లోని చిన్న నీటి వనరుల కింద కేటాయించిన నీటిలో.. వినియోగం కాకుండా మిగిలి ఉన్న సుమారు 45.66 టీఎంసీల నీటిని మొదటగా ఈ ప్రాజెక్టుకు మళ్లించి క్లియర్ చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. అంతేతప్ప ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించలేదు. లేఖలో ఒక పేరాగ్రాఫ్ ని, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని రాద్ధాంతం చేస్తున్నారు” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు-1978 ఒప్పందం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను, నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు మనకు ఉందని తెలిపారు. 2009లోనే దీనికి సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందని, ఈ వాటా కింద వచ్చే 45 టీఎంసీలను, మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలతోనే తాము ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
కానీ, నాడు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి పాలమూరులో కేవలం 7.15 టీఎంసీల వినియోగానికే ఒప్పుకొని వచ్చారని చెప్పారు. ‘‘మీ చేతకాని తనంతో మమ్మల్ని బద్నాం చేస్తే ఎట్లా? పదేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. మీకు డీపీఆర్ గురించి ఏం తెలుసు? 2015లో జీవో ఇచ్చి 2022లో సీడబ్ల్యూసీకి ఇచ్చారు. ఒక డీపీఆర్ చేయడానికి ఏడేండ్లు పడ్తదా? డీపీఆర్ రాకముందే రూ. 27 వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు?” అని బీఆర్ఎస్ నేతలను మంత్రి ఉత్తమ్ నిలదీశారు.
ఎల్ అండ్ టీకి నోటీసులు
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పను లపై ఎల్ అండ్ టీ సంస్థకు నోటీసులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్ వెల్లడించా రు. పలు టెస్టులు, ఇతర అంశాలకు ఎల్ అండ్ టీ ఒప్పుకుందని, త్వరలోనే పనులు మొదలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరంపై ప్రేమ.. పాలమూరుపై వివక్ష ఏమిటి?
‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై మోజుతో రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారు. దాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచారు. కానీ, పాలమూరు ప్రాజెక్టును మాత్రం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు. పాలమూ రుకు రూ. 27 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. పాలమూరు పనులు స్లో డౌన్ చేయాలని సాక్షాత్తు నాడు కేసీఆరే అధికారులకు చెప్పారు.
నార్లాపూర్, ఏదుల పనులను ఆపేశారు. ఎస్ఎల్బీసీకి రూ. 2 వేల కోట్లు, కల్వకుర్తికి రూ. 900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవి.. కానీ, వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం చేశారు” అని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. తాము వచ్చాక 11 పంపుల ఇన్‌స్టాలేషన్ చేపట్టామని, 67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తిచేశామని ఆయన తెలిపారు.
