యూపీ గల్గోటియాస్ ఘనకార్యం.. ధర్మాకోల్ డ్రోన్.. చైనా రోబోతో పరువు తీసిన వర్సిటీ

యూపీ గల్గోటియాస్ ఘనకార్యం.. ధర్మాకోల్ డ్రోన్.. చైనా రోబోతో పరువు తీసిన వర్సిటీ

గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ, ఏఐ సమిట్‌‌లో 'ఓరియన్' అనే పేరుతో ఒక రోబో డాగ్ ను ప్రదర్శించింది. యూనివర్సిటీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. తమ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఈ రోబోను స్వయంగా అభివృద్ధి చేసిందని గర్వంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, టెక్ నిపుణులు, నెటిజన్లు ఆ రోబోను నిశితంగా పరిశీలించగా, అది చైనాకు చెందిన యూనిట్రీ గో2 రోబోడాగ్ మోడల్ అని తేలింది. దీనిని ఆన్‌‌లైన్‌‌లో రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలకే ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. చైనా వస్తువును తెచ్చి, పేరు మార్చి 'మేడ్ ఇన్ ఇండియా'గా ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

చైనా రోబోడాగ్ తోపాటు కొరియన్ సాకర్ డ్రోన్ కూడా తమదేనంటూ గల్గోటియాస్ ఏఐ సమిట్​లో క్లెయిమ్ చేసుకోవడం కూడా దుమారం రేపింది. తాము క్యాంపస్‌‌లో రూపొందించిన 'మేడ్ ఇన్ ఇండియా' ఆవిష్కరణగా ఒక సాకర్ డ్రోన్‌‌ను వర్సిటీ ప్రతినిధి మీడియాకు పరిచయం చేశారు. కానీ, అది దక్షిణ కొరియా కంపెనీ హెల్సెల్ తయారుచేసిన స్ట్రైకర్ వీ3 ఏఆర్ఎఫ్ డ్రోన్ అని నెటిజన్లు బయటపెట్టారు.

ఏకంగా థర్మాకోల్ ముక్కలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, రబ్బర్ బ్యాండ్‌‌లతో కట్టిన ఒక డమ్మీ డ్రోన్‌‌ను కూడా ఈ యూనివర్సిటీ సిబ్బంది ప్రదర్శనకు ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడంతో.. "ఇలాంటి నాసిరకం ప్రదర్శనలతో దేశ పరువు తీస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి" అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

బుకాయించి.. సారీ చెప్పిన యూనివర్సిటీ 

వివాదం ముదరడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. కానీ, యూనివర్సిటీ ప్రతినిధి కెమెరా ముందు "మేమే తయారు చేశాం" అని స్పష్టంగా చెప్పిన వీడియోలను ఆధారంగా చూపుతూ.. నెటిజన్లు నిజం బయటపెట్టారు. 

ఈ క్రమంలో యూనివర్సిటీ యాజమాన్యం క్షమాపణలు కోరుతూ.. వివరణ ఇచ్చింది. విద్యార్థులకు ఏఐ ప్రోగ్రామింగ్‌‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పరికరాలను వాడుతున్నామని, ఆ క్రమంలోనే చైనా రోబోను తెచ్చామని తెలిపింది.