చావుబతుకుల్లో ఉన్న బాలింతకు పునర్జన్మ

చావుబతుకుల్లో ఉన్న బాలింతకు పునర్జన్మ

పద్మారావునగర్, వెలుగు: చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ బాలింతకు గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ డాక్టర్లు అత్యాధునిక వైద్యంలో పునర్జన్మ ప్రసాదించారు. గజ్వేల్‌‌కు చెందిన ప్రవల్లిక(27) స్థానిక ఆస్పత్రిలో ప్రసవించిన మరుసటి రోజే తీవ్రమైన శ్వాసకోశ సమస్యకు గురైంది. 

పెరిపార్టమ్ కార్డియోమయోపతి(పీపీసీఎం) కారణంగా ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. గుండె పనితీరు 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా 80 శాతానికి తగ్గింది. స్థానిక వైద్యులు అత్యవసరంగా గొట్టం ద్వారా శ్వాస అందిస్తూ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌‌ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. 

వెంటిలేటర్‌‌పై అత్యవసర చికిత్స..
ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలోని ఎంఐసీయూలో చేరిన ప్రవల్లికకు క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ కిరణ్ పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశ్రీ, డీఎం డాక్టర్లు షాహిన్, ప్రసన్న, రవీంద్ర, ఇతర విద్యార్థుల బృందం వెంటనే చికిత్స ప్రారంభించింది. అత్యాధునిక వెంటిలేటర్ సపోర్ట్, గుండె పనితీరును మెరుగుపరిచే మందులు, ప్రత్యేక ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ అందించారు.

వైద్యుల నిరంతర శ్రమ ఫలితంగా మరుసటి రోజే ఆమె శ్వాస మెరుగుపడింది. దీంతో వెంటిలేటర్‌‌ను తొలగించి సీపాప్ సాయం అందించారు. క్రమంగా గుండె, మూత్రపిండాల పనితీరు కుదుటపడటంతో ఈ నెల 22 నాటికి కృత్రిమ శ్వాసను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆమె 98 నుంచి 99 శాతం ఆక్సిజన్ స్థాయితో పూర్తి స్పృహలో కోలుకుంటున్నారు.