V6 News

గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ సక్సెస్..కవలలకు జన్మనిచ్చిన కూలీ దంపతులు

గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ సక్సెస్..కవలలకు జన్మనిచ్చిన కూలీ దంపతులు
  • పదేండ్లుగా ప్రైవేటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా దక్కని ఫలితం..
  • గాంధీని ఆశ్రయించిన తొలి ప్రయత్నంలోనే విజయం

హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: సంతానం కోసం పదేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద దంపతుల కలను గాంధీ హాస్పిటల్​లోని ఐవీఎఫ్ సెంటర్ నిజం చేసింది. బోయగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్​రావుకు బుధవారం గాంధీలో కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) జన్మించారు. గతంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసిన ఈ జంట.. సంతానం కోసమే హైదరాబాద్​లోని బోయగూడకు వచ్చారు. ఇందుకోసం వెళ్లని హాస్పిటల్ లేదు.. చేయించుకోని ట్రీట్మెంట్ లేదు.

ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఏకంగా 13 సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోగా, సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయారు. చివరకు బంధువుల సూచనతో గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించగా, డాక్టర్లు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రైవేట్ దవాఖానల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సను, ఖరీదైన మందులను ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా అందించింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు అవసరమైన వైద్య సేవలు, మెడిసిన్స్ అన్నీ ఉచితంగానే అందాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.