
హైదరాబాద్: పెట్రోల్ బంకుల్లో చిప్ లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు మాస్టర్ మైండ్స్ తో పాటు.. 9 మంది పెట్రోల్ బంక్ యజమానులపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. రాష్ట్రంతో పాటు.. ఏపీలో కూడా చిప్ మోసాలు నడుస్తున్నాయన్నారు. చెకింగ్ కోసం వచ్చిన వారికి దొరకకుండా మెషిన్లలో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కొందరు పెట్రోల్ బంకుల ఓనర్లు పరారీలో ఉన్నారని సజ్జనార్ చెప్పారు.
ఏపీలో 22, హైదరాబాద్ లో 13 బంకులను సీజ్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, ఆర్ సీపురంలలో 11 బంకుల్లో చిప్‌లను గుర్తించామన్నారు. అత్యాధునిక చిప్ లతో పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తున్నారని చెప్పారు. పెట్రోల్ తక్కువ వచ్చి.. మీటర్ కరెక్ట్ గా చూపించేలా చిప్ లు ఏర్పాటు చేశారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి బంకుల నిర్వాహకులు ప్రత్యేక చిప్ లు తెప్పించుకున్నారని, కోట్ల రూపాయల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారని చెప్పారు. క్యాన్, బాటిల్ లో మాత్రం కరెక్ట్ ఉన్న పంప్ దగ్గరకు పంపిస్తారని తెలిపారు. లీటర్ పెట్రోల్ కు 30 మి.లీ నుంచి 40 మి.లీ దాకా తక్కువ కొలతలు వస్తున్నాయన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్ నమోదు చేశామని తెలిపారు సీపీ సజ్జనార్.