- అమెరికానుంచి ఢిల్లీకి రాగానే ఎన్ఐఏ అదుపులోకి
- సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీ హత్య కేసుల్లో నిందితుడు
- 2022 నుంచి పరారీ.. అతడిపై 10 లక్షల రివార్డు
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్ అయ్యాడు. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడు, భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌ను అమెరికా సర్కారు బహిష్కరించింది.
దీంతో ట్రంప్ సర్కారు బుధవారం ప్రత్యేక విమానంలో అతడిని ఢిల్లీకి పంపించగా.. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎన్‌ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నది. అతడిని నేరుగా పాటియాలా కోర్టులో హాజరుపరిచింది. కోర్టు కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇవ్వగా.. అనంతరం చట్టపరంగా అన్మోల్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ ఆధీనంలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ ఫొటోను ఎన్‌ఐఏ తొలిసారి విడుదల చేసింది. కాగా, అన్మోల్ బిష్ణోయ్‌తో కలిపి లారెన్స్ బిష్ణోయ్
సిండికేట్ నుంచి 19 మంది అరెస్టయ్యారు.
అమెరికాలో జైలుశిక్ష
పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాకు చెందిన అన్మోల్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విదేశాలనుంచి నడిపించాడు. 2022లో మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా సిద్ధూ మూసేవాలాను మార్గ మధ్యలో అడ్డగించిన దుండగులు అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ హత్యకేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. అనంతరం అతడు ఫేక్ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. దేశంలో అతడిపై దాదాపు 20 కేసులున్నాయి.
అమెరికాలో అతను చివరిసారిగా 2023 ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్‌లో ఒక ఈవెంట్‌లో కనిపించాడు. అక్కడ పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. నాటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అన్మోల్ ను విచారణ నిమిత్తం అతడిని తమకు అప్పగించాలని భారత్ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది.
అతడిని అప్పగించాలని ఎన్‌ఐఏ అధికారులు అమెరికాలోని ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అతడిని డిపోర్ట్ చేసింది. అతడితోపాటు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న 199 మందిని సైతం భారత్‌కు అప్పగించింది. వారిలో ఇద్దరు పంజాబ్ వాంటెడ్ జాబితాలో ఉండగా.. మిగిలిన 197 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు. అన్మోల్ సమాచారాన్ని తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానాన్ని ఎన్‌ఐఏ గతంలో ప్రకటించింది.
