మాట మార్చిన గంగుల.. భూముల స్వాధీనంపై యూటర్న్

మాట మార్చిన గంగుల.. భూముల స్వాధీనంపై యూటర్న్
  • ధరణిలో ఎక్కని భూముల విషయంపై యూటర్న్
  • ప్రైవేటు భూములు లాక్కుంటమని ఎక్కడా చెప్పలేదని వివరణ
  • మాటలను మీడియా వక్రీకరించిందని ఆరోపణ
  • సర్వేకు ప్రజలు సహకరించాలని పిలుపు

ధరణి పోర్టల్​లో ఎక్కని భూములన్నీ మిగులు భూముల కిందే లెక్క.. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. పిల్లలు చదవకపోతే నిర్బంధంగా ఎట్ల చదివిస్తమో.. అట్లనే ఇంటి భూములను ధరణి పోర్టల్ లో ఎక్కించాలి”- గురువారం కరీంనగర్​లో  మంత్రి గంగుల చెప్పిన మాట.

‘‘ప్రభుత్వ భూముల గురించి వచ్చిన ప్రస్తావనలో భాగంగానే నేను అలా చెప్పిన. ప్రైవేటు భూములను లాక్కుంటమని చెప్పలే.. నా మాటలను వక్రీకరించారు..’’– శుక్రవారం మీడియాకు ఇచ్చిన  ప్రెస్​నోట్​లో గంగుల ఆరోపణ

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆస్తుల సర్వేపై మంత్రి గంగుల కమలాకర్ ఒక్క రోజులోనే​మాట మార్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ఆస్తుల సర్వేపై గురువారం కరీంనగర్​లో రివ్యూ చేసిన గంగుల.. ధరణి పోర్టల్​లో ఎక్కని భూములన్నీ మిగులు భూముల కిందే లెక్క అని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. నిర్బంధంగా ప్రజలు ఆస్తుల వివరాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. దీనిపై శుక్రవారం యూటర్న్ తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గురువారం జరిగిన రివ్యూ మీటింగ్​లో తాను ప్రైవేటు భూముల ప్రస్తావన తేలేదని చెప్పారు. ప్రభుత్వ భూముల గురించి వచ్చిన ప్రస్తావనలో భాగంగానే తాను అలా అన్నానని, ప్రైవేటు భూములను లాక్కుంటామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. పేదలకు తమ ప్రభుత్వం మేలు చేస్తుందని, దసరాకు ధరణి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వాలంటీర్లందరినీ ట్రైనింగ్ ఇచ్చే పంపించామని, నెగటివ్ ఆలోచనలు చేయొద్దని, ఆస్తుల సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.