బంజారాహిల్స్ నుంచి బస్తీల దాకా చెత్తను కాలుస్తున్నరు

బంజారాహిల్స్ నుంచి బస్తీల దాకా చెత్తను కాలుస్తున్నరు
  •  గ్రేటర్ సిటీలో చెత్త సమస్యకు చెక్ పెట్టని బల్దియా
  • జీవీపీలు ఎత్తేస్తున్న చోట్ల దారుణంగా పరిస్థితి 
  • స్వచ్ఛ ఆటోలు వెళ్లకపోతుండగా రోడ్లపై వేస్తున్న జనం
  •  రోజుల పాటు ఎత్తకపోతుండగాపేరుకుపోతోన్న చెత్త
  •  కంపు కొడుతుండగా భరించలేక నిప్పు పెడుతున్న వైనం 

హైదరాబాద్, వెలుగు: గార్బేజ్ ఫ్రీ సిటీకి బల్దియా చెక్ పెట్టడడంలేదు. గ్రేటర్ సిటీలో రోజురోజుకు చెత్త సమస్య తీవ్రమవుతోంది. కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. బంజారాహిల్స్ నుంచి బస్తీల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్లపై రోజుల పాటు చెత్త పేరుకుపోతుండగా దుర్వాసన భరించలేక రాత్రిపూట స్థానికులు తగలబెడుతున్నారు. దీంతో దట్టమైన పొగలు వ్యాపిస్తుండగా స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను ఎత్తివేసిన చోటనే ప్రధానంగా ఇలాంటి సమస్య ఉంది. గార్బేజ్ ఫ్రీ సిటీ లక్ష్యంగా బల్దియా 2, 541 జీవీపీలను గుర్తించింది. వీటిలో 500  ప్రాంతాల్లో తొలగించింది. చాలాచోట్ల జీవీపీ పాయింట్లు లేవని బల్దయా ప్రకటించింది. అయితే ఇంటింటికి స్వచ్ఛ ఆటోలు వెళ్లని ప్రాంతాల్లోని జనాలకు చెత్త ఎక్కడ వేయాలో తెలియడంలేదు. రోజుల పాటు ఎదురుచూసి చేసేదేమి లేక రాత్రి పూట రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో చెత్త పేరుకుపోతుంది.  

 యాక్షన్ ప్లాన్ చేపట్టినా నో యూజ్ 

జీవీపీలను ఎత్తివేతకు బల్దియా యాక్షన్ ప్లాన్ చేపట్టింది. వారం రోజులు వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం.. జీవీపీలను ఎత్తివేసిన ప్రాంతాల్లో రోడ్లపై చెత్త వేయకుండా చూడడంతో పాటు వందశాతం స్వచ్ఛ ఆటోల్లోనే చెత్త వేయడం యాక్షన్ ప్లాన్ లక్ష్యం. చెత్త సమస్య నిర్మూలనకు మహిళా సంఘాలు, శానిటేషన్ సిబ్బంది ప్రోగ్రామ్స్ లో పాల్గొని సక్సెస్ చేయాలని, స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వామ్యం కావాలని కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

ఇందుకు బస్తీల్లో మీటింగ్ లు , కో – ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు, ఎస్ఎఫ్ఏ, లోకల్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తో వార్డు స్థాయిలో సభలు , స్లమ్స్ ఏరియాల్లో గార్బేజ్ కలెక్షన్ సమస్యలపై ఫోకస్ పెట్టడం వంటివి నిర్వహించారు. జీవీపీ టీమ్స్​బస్తీల్లో స్వచ్ఛ ఆటోలకు చెత్తవేయని వారితో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే ఇండ్లను గుర్తించారు. స్వచ్ఛ ఆటోలను డోర్ టు డోర్ ట్యాగ్ చేయించారు. బస్తీల్లో అవగాహన ర్యాలీలతో పాటు ప్లకార్డులతో పాటు నినాదాలు చేయడమే కాకుండా జీవీపీల తొలగింపునకు ప్రతిజ్ఞ చేయించే ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడంలేదు. రోజురోజుకు చెత్త సమస్య తీవ్రమవుతూనే ఉంది. 

స్వచ్ఛ ఆటోలు వెళ్లకపోతుండగా.. 

సిటీలో 4 వేల కాలనీలు ఉండగా, వీటిలో వెయ్యికిపైగా కాలనీల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. మిగతా చోట్ల కూడా రెండు, మూడు రోజులకోసారి క్లీన్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కొన్నిరోజులుగా రోడ్లు ఊడ్చే కార్మికులు రావడం లేదంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య వస్తుంది.  

స్వచ్ఛ ఆటోలు 4, 500 ఉండగా.. ఇందులో వెయ్యి వరకు ఫీల్డ్ లోకి వెళ్లడంలేదు. కొన్ని ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి. కొన్నిచోట్ల చెత్తను తీసుకెళ్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఫీల్డ్ లోకే వెళ్లడంలేదు. వచ్చిన వారు కూడా పరిమితంగానే చెత్తను తీసుకెళ్తామని కండిషన్స్ పెడుతున్నారు. మొత్తంగా 25శాతం స్వచ్ఛ ఆటోలు ఇంటింటి చెత్త సేకరణ చేయడంలేదు. స్వచ్ఛ ఆటోలు రాకపోతుండగా రోడ్లపై వేయకతప్పడంలేదని కొన్ని కాలనీలవాసులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ గా వస్తే స్వచ్ఛ ఆటోలోనే వేస్తామని అంటున్నారు.  కోటిన్నర జనాభా కలిగిన సిటీలో  ప్రస్తుతం చెత్తను తరలించే ఆటోలు సరిపోవడం లేదు. వాటిని పెంచడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటేనే చెత్త సమస్య తీరేలా ఉంది. 

రోడ్లను క్లీన్ చేయకపోతుండగా..

సిటీలో అన్ని ప్రాంతాల్లో తీవ్ర చెత్త సమస్య ఉంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గుడిమల్కాపూర్, టోలీచౌకి,  యూసుఫ్​గూడ, సుల్తాన్​ బజార్,  కోఠి, అబిడ్స్, అమీర్ పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జీడిమెట్ల, కూకట్​పల్లి, సరూర్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఉంటుండగా దుర్గంధం వెదజల్లుతోంది. రోజుల నుంచి తరలించడం లేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్లను కూడా క్లీన్ చేయకపోతుండగా సమస్య తీవ్రమైంది. కొన్నిచోట్ల వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో చేసేదేం లేక కొందరు చెత్తను తగలబెడుతున్నారు. అవి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.