- రోడ్లపై చెత్త లేకుండా చేస్త
- జవాబుదారీగా ఉంటూ అవినీతిరహిత పాలన అందిస్త
- ప్రజలు ధైర్యంగా సమస్యలు చెప్పుకోవచ్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉందని, తన మొదటి ప్రాధాన్యత చెత్త సమస్య లేకుండా చేయడమేనని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) జి. సృజన వెల్లడించారు. సీఎంసీ కమిషనర్‌గా ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆమె శనివారం ‘వెలుగు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి వంద శాతం చెత్త సేకరణ జరిగితే రోడ్లపై చెత్త వేసే పరిస్థితి ఉండదన్నారు.
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందిస్తానని, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను కూడా వినియోగించుకుంటానని, అవసరమైతే కీలక నిర్ణయాల కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఏప్రిల్ నుంచి సపరేట్ పాలన
ఏప్రిల్ నుంచి సైబరాబాద్‌లో పూర్తి స్థాయిలో సపరేట్ గా పాలన మొదలవుతుందని, అప్పటివరకు తన ఆధ్వర్యంలో చేయాల్సిన పనుల గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. రేపటి నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చాన్నారు. సీఎంసీ పర్మినెంట్ ఆఫీసు భవనంఎక్కడ నిర్వహించాలనే దానిపై కసరత్తు జరగుతుందని, ఏడాదిలోపు భవనం అందుబాటులోకి వస్తుందని వివరించారు.
నా పని నేను చేస్తూ పోతా...
ప్రజల కోసం పనిచేసేందుకే ఈ ఉద్యోగంలో చేరానని, తన పని తాను చేస్తూ పోతానని, తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవలందిస్తానన్నారు. సమస్య చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా పేదవారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించామని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు.
సింహస్వప్నం నుంచి సేవానిరతి వరకు..
గతంలో విశాఖ జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను మూడు నెలల్లోనే చేపట్టడంతో సృజన తనదైన ముద్ర వేశారు. సబ్బవరం, అబ్బనపాలెంలో పైలట్ ప్రాజెక్టులతో మొదలుపెట్టి, వంద రోజుల్లోనే వివాదాస్పద భూ రికార్డులను సరిచేసి భూ ఆక్రమణదారులకు సింహస్వప్నంగా మారారు. బెదిరింపులకు లొంగకుండా రూల్స్ ప్రకారం ముందుకెళ్లారు. 2017లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో(సిట్) సభ్యురాలిగా ఉన్నారు.
కరోనా టైమ్‌లో 22 రోజుల పసిబిడ్డతో ప్రజలకు సేవలందించడం, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడం, జల సంరక్షణలో తెలంగాణకు జాతీయ అవార్డులు ఆమె ఉద్యోగ జీవితంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్‌గా తనదైన మార్క్ వేశారు.
