IND vs ENG 2025: విండీస్ లెజెండరీ షాకింగ్ స్టాట్స్.. ఒక్కడే సిరాజ్, గిల్, బ్రూక్, స్టోక్స్‌లను మ్యాచ్ చేశాడుగా

IND vs ENG 2025: విండీస్ లెజెండరీ షాకింగ్ స్టాట్స్.. ఒక్కడే సిరాజ్, గిల్, బ్రూక్, స్టోక్స్‌లను మ్యాచ్ చేశాడుగా

క్రికెట్ లో ఆల్ రౌండర్ నిర్వచనం అతని తర్వాతే పుట్టిందేమో. ఓ వైపు బ్యాటింగ్ లో అత్యుత్తమంగా రాణిస్తాడు. మరోవైపు స్పెషలిస్ట్ బౌలర్ గానే వికెట్లు తీస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అతడెవరో కాదు ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ గార్ఫీల్డ్ సోబర్స్‌. ఆల్ రౌండర్ కాదు అంతకు మించి అనేట్టుగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గార్ఫీల్డ్ సోబర్స్‌ రికార్డ్ ఉంటుంది. 1966 లో ఇంగ్లాండ్ పర్యటనలో సోబర్స్ రికార్డ్స్ షాకింగ్ కు గురి చేస్తున్నాయి. ఒక్కడే తన ఆల్ రౌండ్ షో తో షాకింగ్ కు గురి చేస్తున్నాడు.  

ఇటీవలే ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో వ్యక్తిగత గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే ఏకంగా నలుగురు క్రికెటర్ల టాప్ స్టాట్స్ కు మ్యాచ్ చేస్తున్నాయి. అండర్సన్, టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 పరుగులతో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 1966లో ఇంగ్లాండ్ టూర్ లో సోబర్స్ పరుగులు చూసుకుంటే 722 పరుగులు ఉన్నాయి. ఇక సిరాజ్ 23 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిస్తే.. సోబర్స్ అప్పటి సిరీస్ లో 20 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. 

క్యాచ్ ల విషయానికి వస్తే హ్యారీ బ్రూక్ 14 పట్టగా.. ఈ  విండీస్ దిగ్గజం 10 క్యాచ్ లు అందుకున్నాడు. ఈ సిరీస్ లో కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ఐదు టాస్ లు గెలిస్తే.. అప్పటి సిరీస్ లో సోబర్స్ కూడా వరుసగా ఆ సిరీస్ లో ఐదు టాస్ లు గెలవడం విశేషం. ఇలా ప్రతి విషయంలోనూ తన ఆల్ రౌండ్ షో తో సోబర్స్ ఆశ్చర్యపరిచాడు. సిరాజ్ అత్యధికంగా 1113 బంతులు వేస్తే.. సోబర్స్ అంతకు మించి 1618 బంతులు విసిరాడు. యాదృచ్చికంగా ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2-2 తో సమం కాగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ కూడా 1966లో 2-2 తో సమంగా నిలవడం మరో విశేషం. 

సోబర్స్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 1955 నుండి 1972 వరకు వరుసగా 85 టెస్టులు ఆడి 1974 లో  రిటైరయ్యాడు. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్లలో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ఒకరు. 1954 నుంచి 1974 మధ్య వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 93 టెస్టులు, ఒక వన్డే ఆడాడు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 160 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 57.78 సగటుతో 8032 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 365*గా నిలిచింది.