బైక్ ఢీకొని యువకుడు మృతి..సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలు..గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బైక్ ఢీకొని యువకుడు మృతి..సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌కు తీవ్ర గాయాలు..గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: సైకిల్‌‌‌‌‌‌‌‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి బైక్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఇద్దరు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌‌‌‌‌‌‌‌పై వెనుక కూర్చున్న యువకుడు మృతిచెందగా, సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు బైక్ నడిపిన వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపన్‌‌‌‌‌‌‌‌పల్లి తండాకు చెందిన సమీంఖాన్(52) ఎలక్ట్రిషియన్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

ఆదివారం ఉదయం సమీంఖాన్ తన సైకిల్‌‌‌‌‌‌‌‌పై నానక్‌‌‌‌‌‌‌‌రాంగూడ రోటరీ సర్కిల్ నుంచి నానక్‌‌‌‌‌‌‌‌రాంగూడ వైపు వెళ్తున్నాడు. హనుమాన్ టెంపుల్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్.. సైకిల్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్‌‌‌‌‌‌‌‌పై వెనుక కూర్చున్న కామారెడ్డికి చెందిన ఇంద్రసేనారెడ్డి(25) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. 

సైక్లిస్ట్ సమీంఖాన్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బైక్ నడిపిన అరుణ్(22)కు స్వల్ప గాయాలయ్యాయి. అరుణ్​, ఇంద్రసేనారెడ్డి ఓ వైన్స్​లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన అరుణ్‌‌‌‌‌‌‌‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.