ఖాట్మాండు: 2025 సెప్టెంబర్లో జెన్ జెడ్ యువత నిరసనలతో అట్టుడికిపోయిన నేపాల్లో మళ్లీ అలర్లు చెలరేగాయి. జెన్ జెడ్ యువత మరోసారి రోడ్డెక్కారు. బుధవారం (నవంబర్ 19) బారా జిల్లాలో మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ -యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సిపిఎన్-యుఎంఎల్) మద్దతుదారులు, జెన్ జెడ్ యువత మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గురువారం (నవంబర్ 20) రాత్రి 8 గంటలకు వరకు బారా జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని నేపాల్ పోలీసు ప్రతినిధి అబి నారాయణ్ కఫ్లే వెల్లడించారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధానమంత్రి సుశీలా కర్కి స్పందించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని సూచించారు. 2026, మార్చి 5న నేపాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడటానికి అత్యంత సంయమనం, సన్నద్ధతతో పనిచేయాలని హోంశాఖ, భద్రతా సంస్థలను ఆదేశించానని తెలిపారు.
2025, సెప్టెంబర్లో దేశంలో సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత ఉద్యమబాట పట్టారు. దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పటి ప్రధాన మంత్రి, మంత్రుల నివాసాలపై దాడులు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు. జెన్ జెడ్ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది. జెన్ జెడ్ యువత ఆందోళనల్లో కనీసం 76 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జెన్ జెడ్ యువత దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.
