ఆసియా సంపన్నులలో ఫస్ట్ అంబాని..సెకండ్ అదాని

ఆసియా సంపన్నులలో ఫస్ట్ అంబాని..సెకండ్ అదాని

ఆసియా టాప్​ రిచ్​ లిస్టులో మొదటి రెండు ప్లేస్​లూ ఇప్పుడు మనవే. చైనీస్​ బిలినియర్​ ఝాంగ్ షాన్​సన్​ను వెనక్కి నెట్టి అదాని గ్రూప్​ అధిపతి గౌతమ్​ అదాని ఇప్పుడు రెండో ప్లేస్​కు చేరుకున్నారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఓనర్​ ముకేశ్​ అంబాని ఇప్పటికే మొదటి ప్లేస్​లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదాని గ్రూప్​ షేర్లలో వచ్చిన తాజా ర్యాలీతో గౌతమ్​ అదాని బ్లూమ్​బర్గ్​ బిలినియర్స్​ ఇండెక్స్​లో  రెండో స్థానానికి చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా చైనాకి చెందిన ఝాంగ్​ షాన్​సన్ ​ మొదటి ప్లేస్​లో ఉన్నారు. ఆయన కంపెనీల ఐపీఓలు లిస్టింగ్​ కావడంతో అమాంతం ఆసియా టాప్​ రిచ్​గా ఎదిగారు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్లేస్​లోకి మన ముకేశ్​ అంబాని వచ్చేశారు. కాకపోతే ఈ ఏడాది ముకేశ్​ సంపద 175.5 మిలియన్​ డాలర్లు తగ్గిపోయింది. ఇదే టైములో అదాని సంపద 32.7 బిలియన్​ డాలర్ల మేర పెరిగి 66.5 బిలియన్​ డాలర్లకు చేరడం విశేషం. మరోవైపు షాన్​సన్​ సంపద 63.6 బిలియన్​ డాలర్లకే పరిమితమైంది. ముకేశ్​ అంబాని సంపద ఇప్పుడు 76.5 బిలియన్​ డాలర్లు. ప్రపంచంలోని టాప్​ రిచ్​ లిస్టులో ఆయన 13వ ప్లేస్​లో నిలుస్తున్నారు. ఆ తర్వాత 14 వ ప్లేస్​లో గౌతమ్​ అదాని ఉన్నారు. ఆసియా రిచ్​ లిస్టులో ముకేశ్​ గత రెండేళ్లుగా టాప్​లో కొనసాగుతున్నారు. 

అదాని సంపద ఎలా పెరిగింది....

అదాని గ్రీన్​, అదాని ఎంటర్​ప్రైజస్, అదాని గ్యాస్​, అదాని ట్రాన్స్​మిషన్​​ షేర్లు గత కొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. అదాని టోటల్​ గ్యాస్​ షేర్లయితే గత ఏడాది కాలంలో 12 రెట్లు పెరగడం విశేషం. అదాని ఎంటర్​ప్రైజస్ ఎనిమిది రెట్లు​, అదాని ట్రాన్స్​మిషన్ షేర్లు ఆరు రెట్లు పెరిగాయి. ఇదే టైములో అదాని గ్రీన్​ ఎనర్జీ, అదాని పవర్​ నాలుగు రెట్లు పెరగ్గా, అదాని పోర్ట్స్​ రెట్టింపయింది.  ఒకప్పుడు కమోడిటీ ట్రేడర్​గా జీవితం మొదలెట్టిన గౌతమ్​ అదాని ఇప్పుడు పోర్టులు, ఎయిర్​పోర్టులు, ఎనర్జీ, లాజిస్టిక్స్​, అగ్రిబిజినెస్, రియల్​ ఎస్టేట్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్, గ్యాస్​ డిస్ట్రిబ్యూషన్​, డిఫెన్స్​ రంగాలలో కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఎస్​బీ గ్రీన్​ ఎనర్జీ రెన్యువబుల్​ ఎనర్జీ వ్యాపారాన్ని  3.5 బిలియన్​ డాలర్లకు అదాని కొనేశారు. ఇండియాలో రెన్యువబుల్​ ఎనర్జీ సెక్టార్లో జరిగిన అతి పెద్ద డీల్​ ఇదే.​  జపాన్​ కంపెనీ సాఫ్ట్​బ్యాంక్​ నుంచి అదాని గ్రూప్​ దీనిని కొంది. ఇక గత రెండేళ్లలో చూస్తే అదానిలు ఇండియాలో చాలా కంపెనీలనే కొనేశారు. ప్రధానంగా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్టార్​లోనే ఎక్కువ కొనుగోళ్లు జరిపారు. నవీ ముంబై ఎయిర్​పోర్టులో జీవీకే వాటాను, గంగవరం పోర్టులో డీవీఎస్​ రాజుకి ఉన్న 58.1 శాతం వాటాను కూడా  అదాని గ్రూప్​ ఈ ఏడాది మార్చిలోనే చేజిక్కించుకుంది. అంతకు ముందే గంగవరం పోర్టులో వార్​బర్గ్​ పింకస్​కి ఉన్న 31.5 శాతం వాటా కొనేసింది. కిందటేడాది సెప్టెంబర్​లో ముంబై ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులోని జీవీకే గ్రూప్​ వాటాను అదాని గ్రూప్​ కొనుక్కుంది. అహ్మదాబాద్​, లక్నో, మంగళూరు, జైపూర్​, తిరువనంతపురం, గౌహతి ఎయిర్​పోర్టులను గవర్నమెంట్​ బిడ్డింగ్​లో  అదాని గ్రూప్​ చేజిక్కించుకుంది.