0, 1, 1, 0, 5,0.. ఫోర్లు, సిక్సర్ల మోత, భారీ స్కోర్లతో దద్దరిళ్లుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఆరుగురు స్కోర్లు ఇవి. బ్యాటర్ల హవా నడుస్తున్న మెగా లీగ్‌లో రాయల్ చాంలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఊహించని రీతిలో మంటలు పుట్టించారు. ఆ టీమ్ పేసర్లు జోష్ హేజిల్‌వుడ్ (4/12), భువనేశ్వర్ కుమార్ (3/5) బుల్లెట్ల లాంటి బంతులతో ఢిల్లీని వణికించారు.
వరుసగా చెరో మూడు ఓవర్లు వేసిన ఈ పేసు గుర్రాల దెబ్బకు 8 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 13/6తో ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ పవర్‌ప్లే స్కోరుతో చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో 264 భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన డీసీ సొంతగడ్డపై ఈసారి 75 రన్స్‌కే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
ఆర్సీబీ బౌలర్లు హేజిల్‌వుడ్(4/12), భువనేశ్వర్ (3/5) దెబ్బకు ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. వీళ్లిద్దరు వరుసగా చెరో మూడు ఓవర్లు వేసి హడలెత్తించారు. ఒక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. చివరకు 16.3 ఓవర్లలో 75 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో 77/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంప్ బెంగళూరు ఐపీఎల్ 19వ సీజన్‌లో విజయాల సిక్సర్ కొట్టింది. లీగ్ హిస్టరీలోనే ది బెస్ట్ అనే ఓపెనింగ్ స్పెల్‌తో హేజిల్‌వుడ్, భువనేశ్వర్ ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసిన వేళ ఆ జట్టు ఆరో విజయం అందుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ వన్‌సైడ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో డీసీని చిత్తుగా ఓడించింది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి.
తొలుత ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 రన్స్‌కు ఆలౌటైంది. అభిషేక్ పోరెల్ (33 బాల్స్‌లో 3 ఫోర్లతో 30), డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమీసన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. సుయాశ్ శర్మ (1/7), క్రునాల్ పాండ్యా (1/9) చెరో వికెట్ తీశారు. అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలోనే 77/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. దేవదత్ పడిక్కల్ (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్), విరాట్ కోహ్లీ (15 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 నాటౌట్) రాణించారు. అద్భుతమైన స్పెల్‌తో ఆ టీమ్ నడ్డి విరిచిన హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
జోష్, భువీ నిప్పులు
ఇదే గ్రౌండ్‌లో గత పోరులో 264 రన్స్ చేసిన ఢిల్లీ బ్యాటర్లు ఈసారి పూర్తిగా తేలిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన డీసీకి హేజిల్‌వుడ్, భువనేశ్వర్ స్టార్టింగ్ నుంచే చుక్కలు చూపించారు. ప్రతీ బాల్‌కు వికెట్ తీసేలా బౌలింగ్ చేసిన ఈ ఇద్దరి ధాటికి డీసీ టాప్–6 బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే ఖతర్నాక్ యార్కర్‌తో ఓపెనర్, అరంగేట్రం ప్లేయర్ సాహిల్ పరాఖ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసిన భువీ ఢిల్లీని తొలి దెబ్బకొట్టాడు. రెండో ఓవర్లో హేజిల్‌వుడ్ మరింత రెచ్చిపోయాడు.
గత మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (1), ఆ వెంటనే సమీర్ రిజ్వీ (0)ని వరుస బాల్స్‌లో పెవిలియన్ పంపి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన మార్కు అద్భుతమైన స్వింగ్, సీమ్ హడలెత్తించిన భువీ మూడో ఓవర్లో లెంగ్త్ డెలివరీతో ట్రిస్టన్ స్టబ్స్ (5)ను ఔట్ చేశాడు. ఆ వెంటనే ఓ ఊరించే ఔట్ స్వింగర్ కెప్టెన్ అక్షర్ పటేల్ (0) బ్యాట్‌ను ముద్దాడి కీపర్ చేతిలో పడటంతో స్టేడియంలో మొత్తం సైలెంట్ అయింది. ఫలితంగా 3 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 8/5తో దిక్కుతోచని స్థితిలో నిలిచింది. అక్కడితో ఆతిథ్య జట్టు కష్టాలు ఆగలేదు.
నాలుగో ఓవర్లో బాడీ లైన్ బౌన్సర్‌తో నితీశ్ రాణా (1)ను హేజిల్‌వుడ్ వెనక్కుపంపడతో స్కోరు 8/6గా మారింది. మిల్లర్, అభిషేక్ పోరెల్ అతి కష్టంగా వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పవర్‌ప్లేను ఢిల్లీ 13/6తో ముగించింది. తొలి ఆరు ఓవర్లలో ఒకే ఒక్క ఫోర్ (స్టబ్స్) మాత్రమే వచ్చింది. దాంతో డీసీ ఐపీఎల్‌లో లోయస్ట్ స్కోరు (49 రన్స్) రికార్డు బ్రేక్ చేసేలా కనిపించింది. కానీ, అభిషేక్, మిల్లర్ కాసేపు ప్రతిఘటించడంతో ఆ ప్రమాదాన్ని తప్పించుకుంది. పవర్ ప్లే ముగిసిన వెంటనే రసిఖ్ దార్ బౌలింగ్‌లో చెరో ఫోర్ కొట్టిన ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చారు.
రసిఖ్ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి వేగం పెంచే ప్రయత్నం చేసిన మిల్లర్ లాస్ట్ బాల్‌కు కీపర్‌కు చిక్కడంతో ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కైల్ జేమీసన్.. షెఫర్ట్ బౌలింగ్‌లో 6, 4తో అలరించినా.. 13వ ఓవర్లో క్రునాల్ పాండ్యాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. స్పిన్నర్ సుయాశ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (3) బౌల్డ్ అవ్వగా.. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన హేజిల్‌వుడ్ ఒంటరి పోరాటం చేస్తున్న పోరెల్‌ను బౌల్డ్ చేసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఆర్సీబీ 6.3 ఓవర్లలోనే..
చిన్న టార్గెట్‌ను ఆర్సీబీ అలవోకగా అందుకుంది. ఛేజింగ్ ఫస్ట్ బాల్‌కే ఫోర్ కొట్టిన జాకబ్ బెథెల్ (20)... జెమీసన్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో జోష్ మీద కనిపించాడు. కానీ మరో షాట్‌కు ట్రై చేసి నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడినా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇన్‌ఫామ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ .. చమీర వేసిన నాలుగో ఓవర్లో 6, 4తో జోరు చూపెట్టాడు.
ఆపై జెమీసన్‌ను టార్గెట్ చేశాడు. భారీ షాట్లతో 6, 4, 4, 6 కొట్టి ఐదో ఓవర్లో 21 రన్స్ రాబట్టాడు. అక్షర్ బౌలింగ్‌లో సింగిల్‌తో ఐపీఎల్‌లో 9 వేల రన్స్ పూర్తి చేసుకున్న విరాట్.. నటరాజన్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
- ఢిల్లీ: 16.3 ఓవర్లలో 75 ఆలౌట్ (పోరెల్ 30, మిల్లర్ 19, హేజిల్‌వుడ్ 4/12, భువనేశ్వర్ 3/5)
- ఆర్సీబీ: 6.3 ఓవర్లలో 77/1 (పడిక్కల్ 34 నాటౌట్, కోహ్లీ 23 నాటౌట్, జేమీసన్ 1/42)
* 13/6.. పవర్ ప్లేలో ఢిల్లీ చేసిన రన్స్. ఐపీఎల్‌లో ఇదే లోయెస్ట్ పవర్ ప్లే స్కోరు. 2009లో ఇదే ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ 14/2 స్కోరు చెత్త రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.
* ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 9వేల రన్స్ క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో 75 అంతకంటే తక్కువ రన్స్‌కే ఢిల్లీ ఆలౌటవ్వడం ఇది మూడోసారి. ఆర్సీబీ ఇలా నాలుగు సార్లు ఆలౌటైంది.
* ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో 81 బాల్స్ మిగిలుండగానే గెలిచింది. దాంతో లీగ్ చరిత్రలో ఎక్కువ బాల్స్ మిగిలుండగానే టార్గెట్‌ను ఛేజ్ చేసిన రెండో జట్టుగా నిలిచింది. 2008లో ముంబై 87 బాల్స్ మిగిలుండగానే కేకేఆర్‌పై (టార్గెట్ 68) గెలిచింది.

