V6 News

గ్రామ సభల రికార్డింగ్ ఇక మస్ట్! కేంద్రం కొత్త గైడ్లైన్స్ జారీ.. ఆ పోర్టల్లో వీడియో అప్లోడ్ చేయాల్సిందే

గ్రామ సభల రికార్డింగ్ ఇక మస్ట్! కేంద్రం కొత్త గైడ్లైన్స్ జారీ.. ఆ పోర్టల్లో వీడియో అప్లోడ్ చేయాల్సిందే
  • వీడియో రికార్డు చేసి ‘సభసార్ పోర్టల్‌‌‌‌’లో అప్‌‌‌‌లోడ్ చేయాలని సెక్రటరీలకు ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో జరిగే ప్రతి సభను ‘సభసార్’ పోర్టల్‌‌‌‌లో రికార్డు చేసి అప్‌‌‌‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి సమావేశాల నిర్వహణ, రికార్డింగ్ విధానంపై మార్గదర్శకాలు జారీ చేసింది. సమావేశానికి ముందు, జరుగుతున్నప్పుడు ముగిశాక పంచాయతీ కార్యదర్శులు పాటించాల్సిన విధి విధానాలను ఖరారు చేసింది. 

సమావేశం ప్రారంభానికి ముందే పబ్లిక్ అడ్రస్  సిస్టమ్, స్పీకర్లు, మైక్రోఫోన్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, రికార్డింగ్ కోసం స్మార్ట్‌‌‌‌ఫోన్ లేదా డిజిటల్ కెమెరాను వినియోగించాలని, కెమెరా షేక్ అవ్వకుండా ట్రైపాడ్ ఉపయోగించాలని స్పష్టం చేసింది. మీటింగ్ ముగిశాక ఆ రికార్డింగ్‌‌‌‌ను ఎంపీ 4 లేదా ఎంపీ3 ఫార్మాట్‌‌‌‌లో సేవ్ చేసి, ఈ- గ్రామ స్వరాజ్ లాగిన్ ఐడీని ఉపయోగించి సభాసార్ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలని చెప్పింది. 

సిగ్నల్ తక్కువగా ఉన్నా రికార్డింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత నెట్ అందుబాటులో ఉన్నప్పుడు అప్‌‌‌‌లోడ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియలో గ్రామాల్లోని యూత్ వలంటీర్లు లేదా పంచాయతీ డిజిటల్ కోఆర్డినేటర్ల సాయం తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. 

  • గ్రామ సభ తీర్మానాలకు ఏఐ.. 

గ్రామ సభల్లో జరిగే చర్చలు, తీసుకునే తీర్మానాలను రికార్డ్ చేయడం ఇకపై మరింత సులభం కానుంది. ఇందుకోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘సభసార్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్‌‌‌‌ను తీసుకొచ్చింది. గ్రామ సభల వీడియో లేదా ఆడియో రికార్డింగులను నేరుగా డాక్యుమెంట్లుగా మార్చేందుకు దోహదం చేస్తుంది. గ్రామసభ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ఆడియో లేదా వీడియో ఫైల్‌‌‌‌ను సభసార్ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయాలి. ఈ ఏఐ టూల్ ఆ రికార్డింగ్‌‌‌‌ను విశ్లేషించి, అందులో మాట్లాడిన అంశాలను రాతపూర్వక రూపంలోకి  మారుస్తుంది.

 గరిష్టంగా 1 జీబీ సైజు వరకు ఉన్న ఫైళ్లను ఇందులో అప్‌‌‌‌లోడ్ చేయవచ్చు. ఈ టూల్ ఇంగ్లిష్‌‌‌‌లోనే కాకుండా తెలుగుతో పాటు మరో 12 భాషల్లో అందుబాటులో ఉంది. సభలో స్థానిక భాషలో మాట్లాడిన అంశాలను ఇంగ్లిష్‌‌‌‌లోకి ట్రాన్స్‌‌‌‌లేట్ చేయడంతోపాటు తిరిగి తెలుగులోకి మార్చుకునే సదుపాయం ఉంది. దీనివల్ల అధికారులు తీర్మానాలను ఎడిట్ చేసుకోవడం, పీడీఎఫ్ రూపంలో డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవడం సులభమవుతుంది. పంచాయతీ సెక్రటరీలు లేదా అడ్మిన్ అధికారులు ‘ఈ-గ్రామ్​స్వరాజ్’ లాగిన్ వివరాలను ఉపయోగించి sabhasaar.panchayat.gov.in ద్వారా ఈ సేవలను పొందవచ్చు.