Chris Gayle: ఆ ముగ్గురు ఇండియన్ బ్యాటర్లలో ఒకరు నా 175 పరుగుల రికార్డ్ బ్రేక్ చేస్తారు: గేల్

Chris Gayle: ఆ ముగ్గురు ఇండియన్ బ్యాటర్లలో ఒకరు నా 175 పరుగుల రికార్డ్ బ్రేక్ చేస్తారు: గేల్

ఐపీఎల్ లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ కు ఘనమైన చరిత్ర ఉంది. రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకువడంతో పాటు.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా నిలిచాడు. ఓపెనర్ గా ఐపీఎల్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న గేల్.. ఆల్ టైం బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో ఈ విండీస్ వీరుడు చేసిన 175 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 12 ఏళ్ళైనా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉంది. భవిష్యత్ లో గేల్ తాను సెట్ చేసిన 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను ఎవరు బ్రేక్ చేస్తారో తెలిపాడు. 

గేల్ తన యూట్యూబ్ షోలో శుభంకర్ మిశ్రాతో  మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " ఈ రోజుల్లో ఈ యువకులు పవర్ హిట్టింగ్ తో అదరగొడుతున్నారు. ఐపీఎల్‌లో నా రికార్డ్ బ్రేక్ అవుతుందని భావిస్తున్నాను. మీరు స్కోరింగ్ రేటును గమనిస్తే కుర్రాళ్ళు ఎలా ఆడుతున్నారో అర్ధమవుతోంది. నికోలస్ పూరన్, శుభ్‌మాన్ గిల్ నా రికార్డ్ బ్రేక్ చేయగలరని భావిస్తున్నాను. గిల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఆ తర్వాత యశస్వి జైశ్వాల్ అంటే ఇష్టం. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మలో చాలా సత్తా ఉంది". అని గేల్ చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ 2013 టీ20 క్రికెట్ లో క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ లో ఈ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి పూణే వారియర్స్ ఇండియా జట్టుకు పీడ కల మిగిల్చాడు. కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీటిలో 13 ఫోర్లతో పాటు ఏకంగా 17 సిక్సర్లు ఉండడం విశేషం. అప్పటివరకు టీ20 క్రికెట్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గేల్ కు దగ్గరలో వచ్చినా ఈ రికార్డ్ బ్రేక్ చేయాలకేపోయాడు. 2016లో జింబాబ్వేపై ఫించ్ 172 పరుగులు చేసి తృటిలో ఈ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం చేజార్చుకున్నాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరపున గేల్ ఆడాడు.