మెక్సికోలో Gen-Z నిరసనలు: అట్టుడుకుతున్న నగరం.. పోలీసుల లాఠీ ఛార్జ్, వందల మందికి గాయాలు..

మెక్సికోలో Gen-Z నిరసనలు: అట్టుడుకుతున్న నగరం.. పోలీసుల లాఠీ ఛార్జ్, వందల మందికి గాయాలు..

నేపాల్, బంగ్లాదేశ్ లాగానే ఇప్పుడు మెక్సికోలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. Gen-Z తిరుగుబాటుదారులు హింసాత్మకంగా మారారు. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నేషనల్ ప్యాలెస్ బయట నినాదాలు చేస్తూ, డిమాండ్లను నెరవేర్చుకోవాలని పోరాడుతున్నారు. ఈ సమయంలో నిరసనకారులు పోలీసులు,సైన్యంతో హింసాత్మక ఘర్షణకు దిగారు. పోలీసులు, సైన్యం నిరసనకారులను ఆపడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా గాల్లోకి రాళ్ళు రువ్వారు. రక్షణ కోసం సైన్యం, పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ షెల్స్ విసిరారు.

నిరసనలు ఎందుకు :
 సమాచారం ప్రకారం, మెక్సికన్ ప్రభుత్వ భద్రతా విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న నేర సంఘటనలు, అవినీతి, కనిపించకుండా తప్పిపోయిన వారి సంఖ్య పెరగడం, అభద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. క్లాడియా షెన్‌బామ్ ప్రభుత్వం, కార్టెల్‌ల మధ్య పొత్తుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కార్టెల్‌ల నిధులతో నడుస్తుందని  నిరసనకారులు ఆరోపిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, న్యాయ సంస్కరణలు, ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితి కారణంగా యువతలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 1 నవంబర్  2025న జరిగిన మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య కూడా యువతను తిరుగుబాటుదారులను చేసింది.

 హింసాత్మకంగా మారిన నిరసన:  
మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ ముందు నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేపట్టారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ ఇక్కడే  నివసిస్తుంటారు, ఆమె ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. నిరసనకారులు ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు, సైన్యం బారికేడ్లను నిర్మించాయి. నిరసనకారులు వాటిని ఉల్లంఘించడానికి ప్రయత్నించగా  సైన్యం టియర్ గ్యాస్ గ్రెనేడ్లను ప్రయోగించారు, దింతో నిరసనకారులు పోలీసులు, సైన్యంపై రాళ్ళు రువ్వారు. దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి, కానీ మెక్సికో నగరం కేంద్ర బిందువు. నేషనల్ ప్యాలెస్, పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్‌గా మార్చారు.

నిరసనకారులు రోడ్లు, మెట్రో, రైలు సేవలను అంతరాయం కలిగించగా... రైతులు, రవాణాదారులు కూడా సమ్మె ప్రకటించారు. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా గాయపడ్డారు. స్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాలు కూడా రెండు రోజుల పాటు మూసేసారు.