వైటీపీఎస్ను  ప్రైవేటీకరించట్లేదు..కేవలం కొన్ని పనులనే ప్రైవేట్ఏజెన్సీలకిచ్చాం: జెన్కో సీఎండీ హరీశ్ 

వైటీపీఎస్ను  ప్రైవేటీకరించట్లేదు..కేవలం కొన్ని పనులనే ప్రైవేట్ఏజెన్సీలకిచ్చాం: జెన్కో సీఎండీ హరీశ్ 

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్​)ను ప్రైవేటీకరించడం లేదని జెన్​కో సీఎండీ హరీశ్ స్పష్టం చేశారు. పవర్​ప్లాంట్​ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​లో భాగంగా కొన్ని పనులను చట్ట ప్రకారం ప్రైవేట్​ ఏజేన్సీలకు బాధ్యతలు అప్పగించడం ఎప్పటినుంచో జరుగుతున్నదని  బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వైటీపీఎస్​లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్,  కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనులను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.

 ‘తెలంగాణ ప్రభుత్వానికిగానీ, టీజీ జెన్​కో యాజమాన్యానికి గానీ వైటీపీఎస్​ను, దాని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలోని ఏ విభాగాన్నైనా ప్రైవేటీకరించాలనే ఉద్దేశం లేదు. ఈ విద్యుత్ కేంద్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జెన్​కో యాజమాన్యంలోనే కొనసాగుతుంది’ అని హరీశ్​ స్పష్టం చేశారు.

వైటీపీఎస్ స్టేజ్ 1లో  వివిధ పనులను అనేక ఏజెన్సీలు చేపట్టడంతో  సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్లాంట్ నిర్వహణను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఈ పనులను ఒకే ప్రత్యేక నైపుణ్యం కలిగిన సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు.