కార్ల తయారీ ఖర్చు పెరిగింది.. ధరలూ పెరగొచ్చు: ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్

కార్ల తయారీ ఖర్చు పెరిగింది..  ధరలూ పెరగొచ్చు:  ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్
  •     ఆడి ఇండియా బ్రాండ్​ డైరెక్టర్​ బల్బీర్​

హైదరాబాద్​, వెలుగు:  రూపాయి పతనం వల్ల ధరలను పెంచాల్సి రావొచ్చని జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తెలిపింది.  మన కరెన్సీ  గతేడాది 19 శాతం వరకు తగ్గిందని  కంపెనీ బ్రాండ్​ డైరెక్టర్ (ఇండియా)​ బల్బీర్ ​సింగ్ ​ధిల్లాన్​ అన్నారు. హైదరాబాద్ ​జూబ్లీహిల్స్​లో ఆడి  షోరూమ్​ను శుక్రవారం ప్రారంభించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. రూపాయి విలువ తగ్గడంతో పెరిగిన వ్యయాన్ని కొంత వరకు సంస్థ భరిస్తోందని అన్నారు. రాబోయే నెలల్లో కొంత భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా మాకు 30 షోరూమ్​లు, 67 టచ్ పాయింట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆడికి ఏడు షోరూమ్​లు ఉన్నాయి.   చిన్న పట్టణాల పైనా  దృష్టి పెడుతున్నాం. వచ్చే నెల కొత్త స్పోర్ట్స్ ​కారును తీసుకొస్తాం. యూరప్​తో ఇండియా ట్రేడ్​ వల్ల లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ, ఇది అమల్లోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు” అని ఆయన వివరించారు.