నవీ ముంబై: బ్యాటింగ్, బౌలింగ్‌లో సమయోచితంగా రాణించిన గుజరాత్ జెయింట్స్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌ను విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో ఆష్లే గార్డెనర్ (65)తో పాటు బౌలర్లు కూడా సమయోచితంగా రాణించడంతో.. శనివారం ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 10 రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది. తర్వాత యూపీ 20 ఓవర్లలో 197/8 స్కోరుకే పరిమితమైంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (78) టాప్ స్కోరర్. ఓపెనర్లలో కిరణ్ నవ్‌గిరే (1) నిరాశపర్చినా.. మెగ్ లానింగ్ (30), లిచ్‌ఫీల్డ్ రెండో వికెట్‌కు 70 రన్స్ జత చేశారు. ఈ దశలో వచ్చిన హర్లీన్ డియోల్ (0), దీప్తి శర్మ (1) ఫెయిలయ్యారు. మధ్యలో శ్వేత షెరావత్ (25) ఆదుకునే ప్రయత్నం చేసింది. దియోంద్ర డాటిన్ (12), సోఫీ ఎకెల్‌స్టోన్ (11)తో పాటు 16వ ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్ ఔట్ కావడంతో యూపీ పరుగుల వేటలో వెనకబడింది. చివర్లో ఆశా శోభన (27 నాటౌట్) బ్యాట్ ఝుళిపించినా యూపీ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. రేణుకా సింగ్, డివైన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వారెహామ్ తలా రెండు వికెట్లు తీశారు.
గార్డెనర్ ధనాధన్..
గుజరాత్ ఇన్నింగ్స్‌లో బెత్ మూనీ (13) నిరాశపర్చినా.. సోఫీ డివైన్ (38), వన్‌డౌన్‌లో అనుష్క శర్మ (44) ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. 9 బాల్స్ తేడాలో మూనీ, డివైన్ వెనుదిరగడంతో స్కోరు 55/2గా మారింది. ఈ దశలో వచ్చిన గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. రెండో ఎండ్‌లో అనుష్కతో కలిసి ఫోర్లు, సిక్సర్లు బాదింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 103 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. తర్వాత వచ్చిన జార్జియా వారెహామ్ (27 నాటౌట్) ధనాధన్ షాట్లతో చెలరేగింది. సోఫీ ఎకెల్‌స్టోన్ (2/32) వేసిన 18వ ఓవర్‌లో వారెహామ్ 4, 6, 6, 6 దంచింది. అవతలి వైపు భారతి ఫుల్మాలి (14 నాటౌట్) కూడా వేగంగా ఆడటంతో గుజరాత్ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
