త్వరలోనే ఘట్‌‌కేసర్‌‌ – యాదాద్రి ఎంఎంటీఎస్‌‌..రెండున్నరేండ్లలో పూర్తి చేసేందుకు కసరత్తు

త్వరలోనే ఘట్‌‌కేసర్‌‌ – యాదాద్రి ఎంఎంటీఎస్‌‌..రెండున్నరేండ్లలో పూర్తి చేసేందుకు కసరత్తు
  • రూ. 425 కోట్లతో పనులకు రైల్వే సన్నాహాలు

 హైదరాబాద్​సిటీ, వెలుగు : చాలా రోజులుగా పెండింగ్‌‌లో ఉన్న ఘట్‌‌కేసర్‌‌ – యాదాద్రి (రాయిగిరి) ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌ టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో రెండున్నరేండ్లలో ఈ ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేసి తీరాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్​నుంచి నేరుగా రాయిగిరికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం యాదాద్రికి వెళ్లాలంటే బస్సులు లేదా సొంత వాహనాల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా 2015లో ఎంఎంటీఎస్‌‌కు ప్రభుత్వం ప్లాన్‌‌ రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా రైల్వే శాఖనే రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా నేరుగా ప్రాజెక్ట్‌‌ చేపట్టేందుకు ముందుకు రావడంతో ఎంఎంటీఎస్‌‌ సెకండ్‌‌ ఫేజ్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ త్వరలోనే ప్రారంభించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. 

టెండర్ దక్కించుకున్న ఆర్వీఎన్ఎల్ 

ఘటేకేసర్‌‌ – యాదాద్రి రైల్వే ప్రాజెక్ట్ పనులకు సంబంధించిన టెండర్‌‌ ప్రక్రియను కూడా ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పనులను ఆర్వీఎన్ఎల్‌‌ సంస్థ దక్కించుకుంది. ఘట్‌‌కేసర్‌‌ నుంచి రాయిగిరి వరకూ 35 కిలోమీటర్ల దూరం ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయింది.

2016–17లో ఈ ప్రాజెక్ట్‌‌కు రూ.330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. తర్వాత రివైజ్డ్​ఎస్టిమేషన్‌‌ రూ.412.26 కోట్లకు చేరింది. పనులు ప్రారంభించే నాటికి రూ. 425 కోట్లు అవుతుందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కారిడార్‌‌లో సికింద్రాబాద్​నుంచి చర్లపల్లి.. అక్కడి నుంచి ఘట్‌‌కేసర్‌‌, బీబీనగర్, పగిడిపల్లి, భువనగిరి మీదుగా రాయిగిరికి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్​రూట్‌‌లో 59 మైనర్‌‌ బ్రిడ్జిలతో పాటు ఒక మేజర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది.

ఇప్పటికే మట్టి తవ్వకాలు, బ్రిడ్జిల నిర్మాణ పనులను, ఎస్‌‌అండ్‌‌టీ పనులు, ఎలక్ర్టికల్‌‌ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ పనులను రెండు దశల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో రాయిగిరి – భువనగిరి – పగిడిపల్లి మొదటి దశలో 17.09 కిలోమీటర్లు కాగా, రెండో దశ పగిడిపల్లి – బీబీనగర్–  ఘట్‌‌కేసర్‌‌ 16.07 కిలోమీటర్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌‌ పూర్తయితే.. పటాన్‌‌చెరు, తెల్లాపూర్, లింగంపల్లి, ఉమ్దానగర్, మేడ్చల్​ప్రాంతాల మీదుగా నేరుగా రాయిగిరికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది.