జీహెచ్ఎంసీలో జనగణన షురూ.. ఒక ఇంట్లో 10 నిమిషాల సర్వే.. 33 ప్రశ్నలు

జీహెచ్ఎంసీలో జనగణన షురూ.. ఒక ఇంట్లో 10 నిమిషాల సర్వే.. 33 ప్రశ్నలు

హైదరాబాద్ లో  జనగణనలో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ  ఇవాళ్టి(మే 11) నుంచి అధికారికంగా ప్రారంభమైందని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.   ఈ ఇంటింటి సర్వే జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 

ఆర్వీ కర్ణల్ చెప్పిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 20 వేల బ్లాకుల్లో ఎన్యూమరేటర్లు పర్యటిస్తారు. ఒక్కో ఎన్యూమరేటర్ 200 నుంచి 300 ఇళ్లను సందర్శించి, 'ఎన్యూమరేట్' మొబైల్ యాప్ ద్వారా డేటాను నమోదు చేస్తారు. కేవలం నివాసాలే కాకుండా.. కమర్షియల్ భవనాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కాలేజీలు ఇలా నగరంలోని ప్రతి కట్టడాన్ని ఈ సర్వేలో కవర్ చేయనున్నారు.

ప్రజలు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని కమీషనర్ స్పష్టం చేశారు. ఈ డేటాను ఎవరికీ షేర్ చేయబోమని, ఆఖరికి ఆర్‌టీఐ (RTI) ద్వారా గానీ, కోర్టులకు గానీ సమర్పించే ప్రసక్తే లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఐడీ కార్డులతో వస్తారని, తమ వివరాలను ఇతరులకు పంచుకోవడానికి వారికి వీలు లేదని తేల్చి చెప్పారు.

ప్రజలకు సూచనలు:

  • ఈ సర్వేలో కేవలం 33 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఒక్కో ఇంటికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది.
  • ఇంటి యజమాని పేరు, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
  • కుటుంబంలో ఒక్కరు ఉన్నా వివరాలు సేకరిస్తారు. ఒకవేళ డోర్ లాక్ ఉంటే ఎన్యూమరేటర్లు మళ్ళీ వస్తారు.
  • ఒక కిచెన్‌ను ఒక ఫ్యామిలీ యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.