- ఆ తర్వాత వారం పాటు అభ్యంతరాల స్వీకరణ
- అనంతరం ఫైనల్ నోటిఫికేషన్
- 10కి చేరనున్న గ్రేటర్ జోన్లు!
- ప్రస్తుతం ఉన్న 30 సర్కిల్స్50కి పెరిగే చాన్స్
- విలీనమైన ప్రాంతాల్లో మొదలైన జీహెచ్ఎంసీ పాలన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు విలీనం కావడంతో వార్డులు, జోన్లు, సర్కిల్స్ విభజన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. మరో మూడ్రోజుల్లోనే వార్డుల డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. విలీనమైన స్థానిక సంస్థలను ప్రస్తుతం సర్కిల్స్ గా పరిగణించిన జీహెచ్ఎంసీ.. వాటిలోని జనాభా, విస్తీర్ణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ వార్డులుగా పునర్విభజించి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. నోటిఫికేషన్ జారీ చేశాక డీలిమిటేషన్ డ్రాఫ్ట్ పై వారం పాటు అభ్యంతరాలను తీసుకొని, వాటిని పరిష్కరించి.. ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది.
మొత్తం దాదాపు 306 వార్డులుగా పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఒక్కో వార్డులో 40 వేల చొప్పున జనాభా ఉండే చాన్స్ కనిపిస్తున్నది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 27లోపు ముగించాలని జీహెచ్ఎంసీ డెడ్ లైన్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశాక.. జనవరిలో జరిగే కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ కు ఆమోదం తీసుకొని, ఆ తర్వాత ప్రభుత్వానికి పంపాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నది. దీని ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలా? లేదా కార్పొరేషన్లు ఏమైనా విభజించాలా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని, ఒక మున్సిపల్ వార్డు పరిధి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతూ వార్డులను పునర్విభజించనున్నట్లు సమాచారం.
10 జోన్లు, 50 సర్కిల్స్..?
గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లు 10కి పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో ఉత్వర్వులు ఇవ్వనున్నారు. అప్పుడు ఫైనల్‌గా జోన్లు ఏర్పడతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న 30 సర్కిల్స్‌ని 50 సర్కిల్స్‌గా చేసే అవకాశం ఉంది. విలీనానికి సంబంధించిన జోవో 264 విడుదల కాగానే.. ఇందుకు సంబంధించి విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మానిటరింగ్ కోసం 5 మంది జోనల్ కమిషనర్లకు బాధ్యతలను బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అప్పగించారు.
కాగా, బడంగ్ పేట్ కార్పొరేషన్ ని చార్మినార్ జోన్ లో కాకుండా ఎల్బీనగర్ లో కలపాలని ఆల్ పార్టీ నేతలు గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. పరిపాలన కోసం మాత్రమే మానిటరింగ్ అధికారులను నియమించామని, జోన్లు పెరుగుతాయని అధికారులు అంటున్నారు.
ఆ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పాలన షురూ
గ్రేటర్ లో విలీనమైన 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో జీహెచ్ఎంసీ పాలన షురూ అయింది. శానిటేషన్ కి సంబంధించి పాత పద్ధతిగానే ఉదయం 6 .30 గంటలకు అధికారులు ఫీల్డ్‌లో ఉండాలని సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొన్నటి వరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లుగా పనిచేసి ఇప్పుడు డిప్యూటీ కమిషనర్లుగా కొనసాగుతున్న వారిలో కొందరితో పాటు ఇంజీనింగ్ విభాగం అధికారులు గురువారం 7 గంటల లోపు ఫీల్డ్‌లో కి వచ్చారు. రోడ్లపై ఉన్న చెత్తను తరలించడంతో పాటు పర్యవేక్షించారు.
