ముషీరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు తెలిపారు. గురువారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్ల ను గెలిపించుకొని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును బీజేపీకి దక్కేలా చేసి, ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేస్తామని, ఎన్నికల వ్యూహాలపై ఆగస్టులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు వస్తాయని, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని, ఎన్నికల వ్యూహాలపై ముఖ్య నేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు. నాయకులు గంగాపురం పద్మ, నాగేశ్వరరావు, ప్రభుదాస్, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
