- జీహెచ్ఎంసీ వద్ద పూర్తి బిల్లులు తీసుకుంటున్న ఏజెన్సీలు
- నష్టపోతున్న 220 మంది
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఏజెన్సీలు.. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ కార్మికుల జీతాలను దోచుకుంటున్నాయి. 2021 కరోనా టైంలో పనిచేసేందుకు 220 మంది కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దోమల నివారణ కోసం తీసుకున్నారు. దీనికోసం జోన్ వారీగా (పాత జీహెచ్ఎంసీ) ఆరు జోన్లకి టెండర్లు వేసి నియమించుకున్నారు. జోన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ల(ఎస్ఈ)కు ఈ ఏజెన్సీల బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత యేటా టెండర్ల ద్వారా ఏజెన్సీలను నియమిస్తున్నారు.
గతేడాది ఏప్రిల్ లో చివరగా టెండర్లు జరిగాయి. అయితే, టెండర్ రూల్స్ప్రకారం ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.805 చెల్లించాలి. అంటే నెలలో నాలుగు రోజులు వీక్లీ ఆఫ్‌లు పోను 26 రోజులకు రూ.20,930 ఇవ్వాలి. అయితే, ఏజెన్సీలు మాత్రం కార్మికులను నిలువునా దోచుకుంటున్నాయి. కొన్ని జోన్లలో కేవలం నెలకి రూ.9వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఇలా ప్రతి నెలా ఒక్కో కార్మికుడి నుంచి రూ. 11,930 కాజేస్తున్నారు.
ప్రశ్నిస్తే బెరిదింపులు..
ప్రతి నెలా జీహెచ్ఎంసీ నుంచి టెండర్ల ప్రకారం మొత్తం బిల్లులు తీసుకుంటున్న ఏజెన్సీలు కార్మికులకు ఇవ్వాల్సినంత వేతనం ఇవ్వడం లేదు. దీనిపై ఎవరైనా కార్మికులు ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని ఏజెన్సీలు బెదిరిస్తున్నాయి. మరికొందరు ‘టెండర్లో మేం తక్కువ కోట్ చేశాం.. అందుకే జీతాలు తక్కువగా ఇస్తున్నాం’ అని చెప్పి దాటవేస్తున్నారు.
టెండర్లలో మార్పులు చేస్తేనే..
రూల్ ప్రకారం తక్కువ కోట్‌చేసిన వారికి అధికారులు టెండర్లు అప్పగిస్తారు. దీంతో ఏజెన్సీలు 30 శాతానికిపైగా తక్కువ కోట్‌చేసి టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ వేసేప్పుడు తాము నష్ట పోతున్నామని తెలిసీ టెండర్లు వేశారు. అయినా, ఆ నష్టాన్ని భరించకుండా కార్మికుల జీతాల్లో కోతలు పెడుతూ భర్తీ చేసుకుంటున్నారు.
ప్రస్తుత ఏజెన్సీల గడువు వచ్చేనెలతో పూర్తికానున్నది. ఆ లోపు తమ జీతాలు దోచుకున్న ఏజెన్సీల నుంచి డబ్బులు రివకరీ చేసి ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి వచ్చే కొత్త ఏజెన్సీల టెండర్ల రూల్స్‌లో మార్పులు కూడా చేయాలని, భవిష్యత్‌లో ఇది రిపీట్‌కాకుండా చూడాలని
కోరుతున్నారు.
పీఎఫ్,ఈఎస్ఐ లేనే లేదు
శానిటేషన్కార్మికులకు కొన్ని జోన్లలో పీఎఫ్,ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించడంలేదు. నగరంలో దోమల నివారణ కోసం యాంటిలార్వా ఆపరేషన్ డ్యూటీలు చేసే వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే కనీసం ఈఎస్ఐ కూడా లేదు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా, జీతాలు బొక్కుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణ చేసి ఏజెన్సీల నుంచి రికవరీ చేయాలని కొందరు బల్దియా కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
