పద్మారావునగర్/ ముషీరాబాద్, వెలుగు: సిటీలో ఫుట్పాత్ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పాదచారుల మార్గాలను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ప్రకాశ్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్యాంలాల్ బిల్డింగ్, మయూర్ మార్గ్ ప్రాంతాల్లో కోర్టు ఆదేశాల మేరకు జేసీబీల సహాయంతో డబ్బాలు, షెడ్లు, తోపుడు బండ్లను గురువారం నేలమట్టం చేశారు.
ఈ క్రమంలో అధికారులను బీఆర్ఎస్ నాయకులు, వ్యాపారులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పోలీసులు ఆక్రమణలను పూర్తిగా క్లియర్ చేశారు. మరోవైపు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. పాదచారుల హక్కులను కాలరాస్తూ ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు సాగిస్తే సహించేది లేదని, ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
