బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జొమాటో ... ఆన్ లైన్ గ్రాసరీ డెలివరీ పాయింట్లపై జీహెచ్ఎంసీ దాడులు

బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జొమాటో  ... ఆన్ లైన్  గ్రాసరీ డెలివరీ పాయింట్లపై జీహెచ్ఎంసీ దాడులు

 

  •  35  సెంటర్లలో తనిఖీలు,65 శ్యాంపిల్స్ సేకరణ
  • ఆహార పదార్థాలపై ఈగలు
  • ఇంకొన్నిచోట్ల అస్తవ్యస్తంగా నిల్వ 
  • ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు లేవ్​ 
  • తనిఖీల్లో గుర్తించిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఆన్ లైన్ గ్రాసరీ వ్యాపారం చేసే సంస్థల రిటైల్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్  డెలివరీ పాయింట్లపై జీహెచ్ఎంపీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు జరిపారు. ఆన్ లైన్ లో ఐటమ్స్​బుక్ చేస్తే కాలం చెల్లిన వస్తువులు, క్వాలిటీ లేని వస్తువులు వస్తున్నాయని బల్దియాకు పలు ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. 

దీంతో గురువారం నగరంలోని జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్‌‌స్టా మార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జొమాటో తదితర సంస్థల స్టోర్లు, డెలివరీ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో ఆహార పదార్థాల నాణ్యత, స్టోరేజ్ సౌకర్యాలు, ఫుడ్ లైసెన్స్ లు  పరిశీలించారు. 35 డెలివరీ పాయింట్లలో తనిఖీలు జరిపిన అధికారులు అనుమానంగా ఉన్న  65 రకాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. కొన్ని చోట్ల ఈగలున్నట్లు, ఇంకొన్నిచోట్ల ఆహార పదార్థాలను అస్తవ్యస్తంగా నిల్వ చేసినట్టు, ఫుడ్, నాన్ ఫుడ్ ఉత్పత్తులను ఓకే చోట పెట్టారని, స్టోర్స్ లో పని చేసే వారు ఎలాంటి ప్రమాణాలు పాటించట్లేదని గుర్తించారు. 

ఫుడ్ హ్యాండ్లర్లకు ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించే మెడికల్ ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు లేనట్లు తెలుసుకున్నారు. రిపోర్ట్ ను జోనల్ కమిషనర్లకు అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా జోనల్ కమిషనర్లు నోటీసులు జారీ చేయనున్నారు. శ్యాంపిల్స్ కు సంబంధించి 15 రోజుల తర్వాత రిపోర్టులు  రానున్నాయి. అందులో అన్ సేఫ్ అని తేలితే  కేసులు నమోదు చేయనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.