కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి.. అదనంగా నెలకో రూ.100 కోట్లివ్వండి !

కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి..  అదనంగా నెలకో రూ.100 కోట్లివ్వండి !
  •  ప్రభుత్వానికి బల్దియా రిక్వెస్ట్​
  • ప్రతి నెలా రూ.400 కోట్లు అవసరం
  • ఇప్పటికే రూ.200 కోట్లు ఇస్తున్న సర్కారు 
  • ఈసారి ఆస్తి పన్ను, టౌన్​ప్లానింగ్ నుంచి  రూ.100 కోట్లు మాత్రమే వసూలు 
  • కేంద్ర నిధులు రూ.250 కోట్లు రిలీజ్​ చేయాలని రిక్వెస్ట్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: తాము ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ రిక్వెస్ట్​పెట్టుకుంది. ఆగస్టు నెల నుంచి కనీసం రూ. 400 కోట్ల లేనిదే బండి ముందు సాగని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే రూ. 200 కోట్లు ఇస్తున్న సర్కారు మరో రూ.100 కోట్లు ఆరు నెలల పాటు ఇస్తే గండం నుంచి గట్టెక్కుతామని వేడుకుంది. 

గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో రూ.6,553 కోట్ల అప్పు చేయగా, ప్రతి నెల బల్దియా రూ.120 కోట్ల చొప్పున రీ పేమెంట్ చేస్తోంది. దీంతో పాటు రూ.136 కోట్లు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం, మరో రూ.వంద కోట్లు రొటీన్ మెయింటెనెన్స్, ఇతర ఇంధన ఖర్చులతో కలిపి నెలకు రూ. 400 కోట్ల అవసరం ఏర్పడింది.

 ప్రస్తుతం జీహెచ్ఎంసీకి ఉన్న ఆర్థిక వనరులతో అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం కష్టమేనని, అందుకే ప్రభుత్వానికి విన్నవించుకున్నట్టు బల్దియా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రతి నెల జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు వస్తున్నాయని, ఈ నెలాఖరు నుంచి మరో రూ. 100 కోట్లు సహాయం చేయాలని కోరుతున్నారు. కొద్ది నెలల క్రితం రూ.వెయ్యి కోట్ల పైచిలుకు పేరుకుపోయిన కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ఏడాది మార్చి వరకు క్లియర్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లులను జీహెచ్ఎంసీ లోన్లు తీసుకొని చెల్లించింది. 

వాన కాలం తగ్గిన ఆదాయం  

జీహెచ్ఎంసీకి ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి  ఆదాయం ఎక్కువగానే వస్తుంది.   జీహెచ్ఎంసీ ప్రతి నెలా రూ. వంద కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనని, చేస్తేనే జీతాలు, పెన్షన్ల చెల్లింపులు సాధ్యమవుతాయని ఇప్పటికే అధికారులు ట్యాక్స్ సిబ్బంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లుకు కచ్చితమైన ఆదేశాలిచ్చి, టార్గెట్లు కూడా ఫిక్స్​చేసింది. కానీ, ఈ నెలాఖరు వస్తున్నా ఇప్పటి వరకు ట్యాక్స్ కలెక్షన్ కేవలం రూ. 46 కోట్లు మాత్రమే అయ్యింది.

 దీనికి తోడు టౌన్ ప్లానింగ్ ఆదాయం కూడా తగ్గింది. వర్షాకాలం కావడంతో కొత్త ఇండ్ల అనుమతులు పెద్దగా జారీ కావడంలేదు. దీనివల్ల కూడా ఆదాయం తగ్గింది. ప్రతినెలా ఈ విభాగం నుంచి రూ.100 కోట్ల వరకు వచ్చేది. కానీ ఇప్పుడు ఇందులో సగం కంటే  తక్కువగానే వచ్చింది. ఈ రెండు శాఖల నుంచి సుమారు రూ. 100 కోట్ల వరకు అడ్జస్ట్​చేసినా మరో రూ.100 కోట్ల అవసరం ఉంటుంది. అందుకే ప్రతి నెల మాదిరిగానే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కాకుండా రూ. 300 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. ఆరు నెలల పాటు చెల్లిస్తే తర్వాత తాము అడ్జస్ట్​ చేస్కుంటామని 
చెప్తోంది. 

అన్ని అత్యవసర చెల్లింపులే....

జీహెచ్ఎంసీ ఇప్పుడు చెల్లించాల్సి చెల్లింపులన్నీ అత్యవసరంగానే ఉన్నాయి. లోన్ల రీపెమెంట్​కు సంబంధించి రూ.120 కోట్లను ఠంచనుగా చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు రూ.136 కోట్ల జీతభత్యాలు, రెగ్యూలర్ మెయింటెనెన్స్, కార్యాలయాల నిర్వహణ, వాహనాల పెట్రోల్, డీజిల్​కలిపి రూ.400 కోట్ల వరకు తప్పనిసరిగా చెల్లించాల్సినవే ఉన్నాయి. 

దీంతో వచ్చే నెల 1వ తేదీన చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై టెన్షన్​పట్టుకుంది. అయినప్పటికీ జీతాలు, పెన్షన్లకు ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.250 కోట్ల స్పెషల్ ఫండ్ ను కేటాయించింది. కానీ, సర్కారు ఖాతా నుంచి ఈ నిధులు బల్దియా ఖాతాకు క్రెడిట్ కాలేదు. ఈ నిధులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బల్దియా కోరినట్లు తెలిసింది.