స్ట్రీట్ లైట్లు, రోడ్ల నిర్వహణకు త్వరలో జీహెచ్ఎంసీ భారీ టెండర్లు

స్ట్రీట్ లైట్లు, రోడ్ల నిర్వహణకు త్వరలో  జీహెచ్ఎంసీ భారీ టెండర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో ప్రధాన రహదారులు, స్ట్రీట్ లైట్ల పదేండ్ల నిర్వహణ కోసం జీహెచ్‌‌ఎంసీ త్వరలో భారీ టెండర్లు పిలవనుంది. క్యూర్ పరిధిలోని ​మూడు కార్పొరేషన్లు వేరు అయినప్పటికీ ఈ బాధ్యతలు మాత్రం జీహెచ్ఎంసీనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఇందులో భాగంగానే నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కోసం కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో విడతను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. రూ.3,145 కోట్ల వ్యయంతో 1,014  కిలోమీటర్ల పొడువున రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనుంది. బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయా రోడ్ల రికార్పెటింగ్, క్లీనింగ్, ఫుట్ పాత్​ల నిర్వహణ ఇలా అన్ని ఏజెన్సీలే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 7,60,591 స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ కోసం రూ. 1,341కోట్లతో  టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీకి అనుమతి ఇచ్చింది. 

దీంతో మరో నెల రోజుల్లోపు టెండర్ల ప్రక్రియను చేపట్టి, నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి గతంలో ఉన్న విధానానికి భిన్నంగా ఢిల్లీ తరహా విధానాన్ని అనుసరిస్తూ కేవలం వెలిగే లైట్లకు మాత్రమే చార్జీలు చెల్లించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.