జూన్ 2 నుంచి నుంచే గిగ్‌‌ వర్కర్ల చట్టం..4 లక్షలకు పైగా డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు

జూన్ 2 నుంచి నుంచే  గిగ్‌‌ వర్కర్ల చట్టం..4 లక్షలకు పైగా  డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు
  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమల్లోకి తెస్తూ జీవో  
  • 4 లక్షలకు పైగా  డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు
  • హక్కుల రక్షణకు చట్టబద్ధ విధివిధానాలు.. పక్కాగా అమలయ్యేలా కార్యాచరణ.. గెజిట్​ జారీ చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, వివిధ డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లపై ఆధారపడి పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్‌‌ కార్మికుల చిరకాల స్వప్నం సాకారమైంది. వారి సామాజిక భద్రత, సంక్షేమానికి భరోసా కల్పించే చరిత్రాత్మక చట్టాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ‘తెలంగాణ ప్లాట్‌‌ఫామ్‌‌ ఆధారిత గిగ్‌‌ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం–2026’ (యాక్ట్ నెం. 21)  జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా అమలుల్లోకి రానున్నది. 

ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ  శాఖ కార్యదర్శి హరిచందన దాసరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మంగళవారం రాష్ట్ర  గెజిట్‌‌లో ఈ చట్ట నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా ప్రచురించనున్నది. ఈ చట్టం అమలుతో అసంఘటిత రంగంలో అభద్రత మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్లాట్‌‌ఫామ్‌‌ ఆధారిత కార్మికులకు చట్టబద్ధమైన హక్కు లు, రక్షణ లభించనున్నాయి. నగరాలు, పట్టణాల్లో రేయింబవళ్లు కష్టపడుతూ శ్రమ దోపిడీకి గురవుతున్న గిగ్‌‌ వర్కర్ల డేటాను సేకరించి, వారి పేరు నమోదు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, కార్మికులకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రతతో పాటు వివిధ రకాల సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.  గిగ్‌‌ వర్కర్ల సంక్షేమం కోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చట్టంలోని అంశాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.


కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఈ చట్టం పరిధిలోని ప్రతి నిబంధనను పక్కాగా అమలు చేసేలా కార్మిక శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది.  రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఈ సామాజిక భద్రతా చట్టం ప్రకారం, ప్రతి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఆధారిత కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు కార్డులతో పాటు విధిగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. కార్మిక శాఖ  కమిషనర్ ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునేలా ఈ జీవోలో ఆదేశాలు ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టంపై రాష్ట్రంలోని కార్మిక సంఘాలు, గిగ్‌‌‌‌ వర్కర్ల అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యాప్‌‌‌‌ ఆధారిత సేవల రంగంలో పనిచేసే నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ధీమాను, ఆర్థిక భరోసాను ఇస్తుందని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. సుదీర్ఘంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న గిగ్‌‌‌‌ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈ జీవో జారీ కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు .