బిడ్డ పుట్టిందని నమ్మించేందుకే బాలిక కిడ్నాప్.. బెడిసికొట్టిన మాజీ దంపతుల ప్లాన్

బిడ్డ పుట్టిందని నమ్మించేందుకే బాలిక కిడ్నాప్.. బెడిసికొట్టిన మాజీ దంపతుల ప్లాన్

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండలో కిడ్నాప్‎కు గురైన నాలుగేండ్ల చిన్నారి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడాకుల తర్వాత మళ్లీ కాపురం చేయాలనుకున్న ఓ జంట.. తమకు బిడ్డ ఉండి ఉంటే తల్లిదండ్రులు అంగీకరిస్తారని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసు వివరాలను గోల్కొండ పీఎస్‎లో ఆదివారం సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వెల్లడించారు. సాలే నగర్ కంచ గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్ ముజామిల్, ముజాత్ ఫాతిమా బేగం దంపతులు.

వీరి రెండో కుమార్తె సఫియా బేగం(4) శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్‎కు గురైంది. బాధితుల ఫిర్యాదుతో టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో 9 పోలీస్ బృందాలు సీసీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, సమ్రిన్ బేగాన్ని నిందితులుగా గుర్తించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వీరు ఆటోలో ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

బిడ్డ ఉంటే అంతా సద్దుమణుగుతుందని..

అరెస్టయిన నిందితులు మహ్మద్ ఫయాజ్, సల్మా బేగం అలియాస్ సమ్రీన్ బేగం గతంలో భార్యాభర్తలు. విడాకుల తర్వాత సల్మా గర్భవతి కావడంతో గర్భస్రావం చేయించుకుంది. ఆ తర్వాత ఫయాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సల్మా మళ్లీ ఫయాజ్‎తో సంప్రదింపులు జరపగా, మళ్లీ కాపురం చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అయితే ఫయాజ్ తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని అంగీకరించబోరని, తమ ఇద్దరికి బిడ్డ ఉండి ఉంటే అంతా సద్దుమణుగుతుందనే ఆలోచనతో ఇద్దరూ కలిసి ఓ బాలికను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు.

పథకం ప్రకారం సాలే నగర్ కంచా నుంచి బాలిక సఫియాను ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారు. బాలికను తమ ఇంట్లో దాచి ‘మా బిడ్డ’ అని ఫయాజ్ తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పటికే సీసీ ఫుజేటీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించడంతో ఈ వ్యవహరం బెడిసికొట్టింది.

దీంతో నిందితులను రిమాండ్​కు తరలించిన పోలీసులు.. చిన్నారిని బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల నుంచి ఒక ఆటో, రెండు సెల్ ఫోన్ లు, చిన్నారి దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, గోల్కొండ ఇన్ స్పెక్టర్  పి సైదులు, ఎస్పై రాము నాయుడు, ఏఎస్సై ఆంజనేయులు ఉన్నారు.